ఉండ‌వ‌ల్లి.. ఎందుకీ రాంగ్ గైడెన్స్ ఇస్తున్న‌ట్టు?

పాత‌త‌రం కాంగ్రెస్ మేధావులు.. ఆ పార్టీని నిండా ముంచేసి, ఇప్పుడు ఉచిత స‌ల‌హాల కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన కాంగ్రెస్ మూలాలున్న మేధావుల్లో ఒక‌రైన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఈ ఉచిత…

పాత‌త‌రం కాంగ్రెస్ మేధావులు.. ఆ పార్టీని నిండా ముంచేసి, ఇప్పుడు ఉచిత స‌ల‌హాల కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టుగా ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన కాంగ్రెస్ మూలాలున్న మేధావుల్లో ఒక‌రైన ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఈ ఉచిత స‌ల‌హాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉండ‌టం విడ్డూరం. 

రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతున్నంత వ‌ర‌కూ కాంగ్రెస్ లోనే ఉండిన స‌మైక్య వాది ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. అప్పుడేమో.. సోనియాకు స‌రైన స‌ల‌హాలు ఇవ్వ‌లేక‌పోయారు! విభ‌జ‌న వ‌ద్ద‌ని దాని వ‌ల్ల సీమాంధ్ర‌కే గాక‌.. కాంగ్రెస్ కు కూడా రెండు చోట్లా న‌ష్టం జ‌రుగుతుంద‌న్న చిన్న‌పాటి అవ‌గాహ‌న‌ను సోనియాకు క‌ల్పించ‌లేక‌పోయిన ఈ మేధావుల‌ను ఏమ‌నాలో మ‌రి!

సోనియాకు అంటే తెలియ‌దు, మ‌రీ ఆమె వెంట ఉండి అడుగుల‌కు మ‌డుగులొత్తిన వీళ్ల‌కు తెలియ‌దా? అప్పుడు సొంత పార్టీలో, నిర్ణ‌యాధికారంలో ఉన్న పార్టీలో ఉంటూ.. స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని అధినేత్రికి విన్న‌వించ‌లేక‌పోయిన వీళ్లు.. ఇప్పుడు ఉచిత స‌ల‌హాలు మాత్రం బాగా ఇస్తున్నారు!

రాష్ట్రం మీద చాలా బాధ్య‌త‌గా మాట్లాడుతున్న ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కు విభ‌జ‌న స‌మ‌యంలో ఈ బాధ్య‌త లేక‌పోయిందా?  కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఇన్ని విష‌యాల‌ను సోనియాకు విపులంగా చెప్పి, విభ‌జ‌న‌ను ఆపించి ఉంటే, క‌నీసం 2014 ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కూ విభ‌జ‌న వ‌ద్ద‌ని సోనియాకు అర్థ‌మ‌య్యేలా చెప్పి ఉంటే.. ప‌రిస్థితి మ‌రోలా ఉండేది క‌దా!

మ‌రి అప్పుడు విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌లేక‌పోయిన ఉండ‌వ‌ల్లి.. ఇప్పుడు ప్రెస్ మీట్ల‌లో మాత్రం దంచి కొడుతున్నారు! ఎవ‌రేం చేయాలో  ఇట్టే చెప్పేస్తూ ఉన్నారు.  ఇదంతా చిటికెల పందిరి వ్య‌వ‌హారం. అధికార పార్టీలో ఉన్న‌ప్పుడు ఏం సాధించ‌లేక‌, ఇప్పుడు వాళ్లు అది చేయాలి, వీళ్లు ఇది చేయాలంటూ మాట్లాడేయ‌డం ఈజీనేమో!

ఇప్పుడు అరుణ్ కుమార్ ఏపీలోని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఇస్తున్న విలువైన సల‌హా ఏమిటంటే.. అర్జెంటుగా కేంద్రంతో త‌గాదా పెట్టేసుకొమ్మ‌ని. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో త‌గాదా పెట్టేసుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి ఉచిత స‌ల‌హా ప‌డేస్తున్నారు. 

చంద్ర‌బాబు చేసిన పాపాల నేప‌థ్యంలో.. నిర్వాసితుల వ్య‌వ‌హారంలో కేంద్రం బాధ్య‌త తీసుకోవ‌డం లేద‌ని, దీనిపై కేంద్రంతో రాజీ వైఖ‌రి కాకుండా, గొడ‌వ పెట్టుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి డైరెక్టుగా చెబుతున్నారు. గొడ‌వ అనే మాట‌ను ఆయ‌నే స్వ‌యంగా వాడుతున్నారు కూడా!

ఒక‌వైపు ఈ వ్య‌వ‌హారాల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతూ ఉంది. నిర్వాసితుల భారాన్ని కేంద్రం వ‌దిలించుకుంటే స‌రిపోద‌ని చెబుతోంది. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు అని, దాన్ని విభ‌జ‌న చ‌ట్టంలో పెట్టార‌నే అంశాన్ని కూడా ప్ర‌స్తావిస్తోంది. ఇప్పుడు విన్న‌వించుకుని, అర్థ‌మ‌య్యేలా చెప్పి, విశ‌దీక‌రించ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వ బాధ్య‌త‌. ఈ ప్ర‌య‌త్న‌మే జ‌రుగుతోంది.

అయితే ఉండ‌వ‌ల్లి మాత్రం.. త‌గాదా అంటున్నారు, కోర్టుకు ఎక్కాలి, గొడ‌వ పెట్టుకోవాల‌ని మాట్లాడుతున్నారు. మ‌రి ఈ స‌మ‌స్య‌కు అదేనా ప‌రిష్కారం?  కేంద్ర ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త‌ను తీసుకోక‌పోతే, తీసుకోమ‌ని ఏ ప్ర‌ధానో, అమిత్ షా నో తేల్చి చెబితే.. ఆ త‌ర్వాతి సంగ‌తి ఆ త‌ర్వాత‌. ప్ర‌స్తుతం నిర్మాణం జ‌రుగుతూ ఉంది, ఈ విష‌యంలో కేంద్రంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. 

ఒక్కో అవ‌రోధాన్నీ అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తోంది. రేపు కేంద్రంలో బీజేపీకి జ‌గ‌న్ అవ‌స‌రం క‌లిగిందంటే.. అప్పుడు ఇలాంటి అంశాల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చి ప‌ని చేయించుకోవ‌డం మంచిదా?  లేక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన అంశంలో దూకుడుగా వెళ్లి కేంద్రం కూడా అడ్డం తిరిగేలా చేసుకోవ‌డం గొప్ప‌దా?  మొద‌టి మార్గాన్ని జ‌గ‌న్ అనుస‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తుంటే, అలా కాద‌ని.. గొడ‌వే పెట్టుకోవాల‌ని ఉండ‌వ‌ల్లి తేల్చి చెబుతున్నారు. 

ఉండ‌వ‌ల్లి చెప్పిన‌ట్టుగా చేస్తే.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు కేంద్రానికి, రాష్ట్రానికి ఒక వివాదంగా నిలిచిపోతాయి త‌ప్ప‌, ప‌రిష్కారం అయితే క‌చ్చితంగా దొర‌క‌దు!  రాష్ట్ర విభ‌జ‌న‌పై ఉండ‌వ‌ల్లి కోర్టుకు ఎక్కారు చాలా కింద‌టే, ఆ పిటిష‌న్ ఏమైందో ఆయ‌నే చెప్పాలి. ఇప్పుడు ఆయ‌న చెప్పిన పిటిష‌న్లు వేస్తే.. వాటి ప‌రిస్థితి కూడా అదే కావొచ్చు! ఇదంతా చూస్తుంటే.. ఉండ‌వల్లిది ప‌క్కా రాంగ్ గైడెన్స్ అని స్ప‌ష్టం అవుతోంది. 

అలాగే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్న‌.. ఈయ‌న అప్పుడెందుకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా త‌మ సోనియ‌మ్మ‌ను ఒప్పించ‌లేక‌పోయారు! ఇప్పుడు కేంద్రంతో ఘ‌ర్ష‌ణ ప‌డాల‌ని ఉచిత స‌ల‌హా ఇస్తున్న ఉండ‌వ‌ల్లి, అప్పుడు మాత్రం సోనియాతో రాజీ ప‌డాల‌ని జ‌గ‌న్ కు ఎందుకు సూచించిన‌ట్టు! అనే సందేహాలు రాక‌మాన‌వు.