వ్యాక్సినేషన్ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తూనే ఉన్నాయి. ఆది నుంచి ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుచితంగానే ఉంది. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రభావాన్ని ఏ మాత్రం అంచనా వేయకుండా, కనీసం మహారాష్ట్ర వంటి చోట అయినా వ్యాక్సినేషన్ కు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకుండా.. ఏడెనిమిది కోట్ల డోసులను ఆదిలోనే విదేశాలకు ఎగుమతి చేసింది మోడీ సర్కారు.
దేశీయ అవసరాల గురించి అంచనాకు రాకుండా అప్పట్లో చేసిన ఆ పని ప్రభావం సెకెండ్ వేవ్ మీద స్పష్టంగా కనిపించింది. విశృంఖలమైన స్థాయిలో కరోనా విజృంభించింది సెకెండ్ వేవ్ లో. ఇక ఇప్పుడు కూడా దేశీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ అందుబాటులోకి లేదు.
ఆగస్టు ఒకటి నుంచి రోజుకు కోటి డోసులు అని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ, ఇప్పటికీ ఒక రోజు 50 లక్షలకు మించిన స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగితే రెండో రోజు 30 లక్షల స్థాయికి పడిపోతోంది. మరి మరో నాలుగైదు రోజుల్లో ఏకంగా రోజుకు కోటి డోసులు అందుబాటులోకి వచ్చేంత సీన్ ఉంటుందా? అనేది ప్రశ్నార్థకం. దానికి సమాధానం దొరకడానికి మరెంతో సమయం లేదు. అప్పుడు అసలు కథ బయటపడుతుంది.
అంతకన్నా ముందే.. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలోని డొల్లతనం బయటపడింది. ఏకంగా 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆది నుంచి సబబుగా లేదు. అప్పట్లోనే ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరం తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశారు.
ప్రైవేట్ కు అన్ని వ్యాక్సిన్లు ఎందుకని.. ప్రభుత్వమే వాటిని తీసుకుని ప్రజలకు అందించాలని జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు ప్రజల్లో వ్యాక్సిన్ పై ఎన్నో ఆశలున్న సమయంలో ప్రభుత్వమే ప్రైవేట్ కు అంటూ ఏకంగా 25 శాతం వ్యాక్సిన్లను కేటాయించడానికి అనుమతిని ఇవ్వడాన్ని జగన్ తప్పు పట్టారు.
కట్ చేస్తే.. ఇదే అంశం పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ వాళ్లు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ షాకింగ్ ఫిగర్స్ ను వెల్లడించింది. ఇప్పటి వరకూ ప్రైవేట్ లో వ్యాక్సినేషన్ జరిగిన శాతం కేవలం ఏడు శాతమని కేంద్రం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రైవేట్ లో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు ఏడుశాతమంటూ కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
అయితే ఇప్పటి వరకూ క్రమం తప్పకుండా 25 శాతం వ్యాక్సిన్లను కేంద్రం ప్రైవేట్ ఆసుపత్రులకూ, వైద్య సంస్థలకూ కేటాయిస్తూ వస్తోంది. అందులో కేవలం ఏడు శాతం మాత్రమే వినియోగం అయ్యాయని కేంద్రమే స్పష్టతను ఇచ్చింది. అంటే 18 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ వద్ద స్టాక్ ఉన్నట్టే!
ఇవే వ్యాక్సిన్లను అయినా ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని కూడా ఈ మధ్యనే జగన్ కేంద్రానికి ఇంకో లేఖ రాసినట్టున్నారు. ప్రైవేట్ వాళ్లు ఉపయోగించని వ్యాక్సిన్లను అయినా ప్రభుత్వానికి కేటాయించాలన్నారు. అయితే.. ఇప్పటి వరకూ ఈ అంశాలపై కేంద్రం స్పందించడం లేదు. ఇక పార్లమెంట్ లో చేసిన ప్రకటన ద్వారా.. ప్రైవేట్ కు కేటాయించిన వ్యాక్సిన్లు వినియోగంలో లేవని కూడా స్పష్టత వస్తోంది.
మరి ఒకవైపు అనేక మంది వ్యాక్సినో మొర్రో అంటుంటే.. ఇప్పటికీ పరిమితులు, షరతులతోనే వ్యాక్సిన్ ను అందిస్తుంటే.. అలాంటప్పుడు ప్రైవేట్ వైద్య సంస్థల వద్ద మాత్రం ఎందుకు వ్యాక్సిన్లను పెడుతున్నట్టు? అక్కడ స్టాకు మిగిలిపోతున్నా.. ఎందుకు వాటిని ప్రజల కోసం ప్రభుత్వం తిరిగి తీసుకోవడం లేదనేది శేష ప్రశ్న! కరోనా ఇంత ప్రమాద తీవ్రతకు వచ్చినా ఇప్పటికీ వ్యాక్సిన్ విషయంలో మోడీ ప్రభుత్వం ఏ మేరకు శ్రద్ధ వహిస్తోందనేందుకు ఇదో ఉదాహరణ!