తెలంగాణా రాకముందు, వచ్చాక కూడా కేసీఆర్ ఎన్నో ఉప ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఆయనకు ఉప ఎన్నికల స్పెషలిస్టు అనే పేరు కూడా ఉంది. సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ కు అపజయం లేదు. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు అనేక ఉప ఎన్నికలు, ఇంకా కొన్ని ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అపజయాలు తక్కువ.
ఉప ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలంత పక్కా ప్లానింగ్ తో ఎదుర్కొన్నారు. ఆయన వ్యూహాలకు ప్రతిపక్షాలు చాలా సార్లు దిమ్మ తిరిగి కిందపడి గిలగిలా కొట్టుకున్నాయి. అంతటి వ్యూహాలు, రాజకీయ చతురత ఉన్న కేసీఆర్ మొదటిసారి తీవ్రంగా భయపడుతున్నారని రాష్ట్రంలో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది.
ప్రతిపక్షాలు మాత్రమే కాకుండా, కేసీఆర్ వ్యతిరేక మీడియా కూడా ఈ ప్రచారం చేస్తోంది. కేసీఆర్ కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్నారు. విచిత్రమేమిటంటే కేసీఆర్ కాంగ్రెస్ కో, బీజేపీకో భయపడటం లేదు ఒక వ్యక్తికీ భయపడుతున్నారు. అతనే మాజీ మంత్రి ఈటల రాజేందర్.
ఒకవేళ ఈటల గెలిస్తే అదో సంచలనం కావడం గ్యారంటీ. ముఖ్యంగా బీజేపీకి పట్టపగ్గాలు లేకుండా పోతాయి. ఈ ఊహే కేసీఆర్ ను తీవ్రంగా భయపెడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే హుజూరాబాదుకు ఉప ఎన్నిక జరగాల్సి రావడం కేసీఆర్ స్వయం కృతాపరాథం. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాత ఇక ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని రాజకీయ పార్టీలు, జనం అనుకున్నారు.
నాగార్జున సాగర్ లో నోముల నరసింహయ్య చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలోనూ గెలుపుకోసం కేసీఆర్ చెమటోడ్చారనే చెప్పుకోవాలి. జానా రెడ్డికి దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి తర్జనభర్జన పడ్డారు. అక్కడ గెలవడం కోసం భారీగా డబ్బు ఖర్చు చేశారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు హుజూరాబాదులోనూ ఈటలకు దీటైన అభ్యర్థి కోసం తర్జన భర్జన పడుతున్నారు.
ఈటలను మంత్రి పదవి నుంచి ఆవేశంతో తీసివేశారో, ఆలోచించే తీసేశారో తెలియదుగానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంత క్లిష్టమవుతుందని కేసీఆర్ ఆలోచించి ఉండరు. తన చర్య వల్ల ఉప ఎన్నిక వస్తుందని కూడా కేసీఆర్ అనుకోని ఉండరు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే అప్పటి ఆరోగ్య మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి అయిన డాక్టర్ రాజయ్యను తీసేశారు. కానీ రాజయ్య గమ్మున ఉండిపోయాడు.
దీంతో గత ఎన్నికల్లో ఆయనకు మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు. రాజయ్య గెలిచాడు. ఈటల కూడా అదే విధంగా ఉంటాడని కేసీఆర్ ఊహించి ఉంటారు. రాజయ్యను ఎందుకు తీసీశారో ఇప్పటికీ తెలియదంటారు కొందరు ప్రతిపక్ష నాయకులు. కానీ ఈటల విషయంలో అలా జరగలేదు. ఆయనను పెద్ద అవినీతిపరుడిగా కేసీఆర్ తన మీడియాలోనే ముద్ర వేశారు. దీంతో ఈటల తిరుగుబాటు చేశారు. ఇదే కేసీఆర్ మెడకు చుట్టుకుంది.
హుజూరాబాదులో కేసీఆర్ వ్యవహార శైలిని టీఆర్ఎస్ నాయకులు పక్కా ప్లానింగ్ అని చెబుతుండగా, కేసీఆర్ భయపడుతున్నాడని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సాధారణంగా కేసీఆర్ ఎన్నికల సమయంలో తన ప్లానింగ్ గురించి బహిరంగంగా నోరు విప్పరు. కానీ ఈ మధ్య దళిత బంధు పథకాన్ని హుజూరాబాదు ఉప ఎన్నిక కోసమే తెచ్చామని నోరు జారారు కేసీఆర్. ఇది ఆయన చేసిన పొరపాటా ? ప్లానింగ్ లో భాగమా ? తెలియదు.
ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం వేట మొదలైంది. ఒక సీఎంగా ఎన్నో బాధ్యతలున్నా, అన్నీ హుజూరాబాద్ ముందు హుష్ కాకీ అయిపోయాయి. కరోనా థర్డ్ వేవ్, ఖజానా రుణబారం, ఉద్యోగుల వేతనాలు, వరదలు, శాంతి భద్రతలు. ఇలా ఇంకెన్నో ముఖ్యమైన అంశాలన్నీ మరుగునపడిపోయాయి. కారణం… సీఎం స్వయంగా హుజూరాబాద్ జపం చేస్తుంటే మంత్రులు, అధికారులు ఏం చేయగలరు? పైగా మంచి ఐఏఎస్ అధికారులను హుజూరాబాద్ కోసం ఏర్పాటుచేయమని కేసీఆర్ చెప్పారు.
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం స్థానికంగా మంచి పేరున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డికి గాలమేశారు. కానీ గులాబీల తొందరపాటో, కౌశిక్ గ్రహపాటో తెలీదు కానీ.. ఆడియో లీక్ దెబ్బకు టీఆర్ఎస్ కు షాక్, కౌశిక్ కు వాత మాత్రమే మిగిలాయి. అసలిదంతా కాదు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లని వెతికారు కొద్దిరోజులు. ఆ తర్వాత ఈటలకు ధీటుగా బలమైన బీసీ అభ్యర్థి అనే స్లోగన్ తో. తెలుగుదేశంలో ఇంకా ఎందుకున్నానా అని కిందా మీదా అవుతున్న ఎల్.రమణకు గాలం వేశారు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.