చాలా సినిమాల ట్రయిలర్స్ చూస్తే కథ ఏంటో తెలిసిపోతుంది. మరికొన్ని సినిమాల ట్రయిలర్ చూస్తే కథ ఏంటనేది చెప్పలేకపోవచ్చు కానీ జానర్ ఏంటనేది మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. కానీ అటు కథ చెప్పలేక, ఇటు జానర్ కూడా చెప్పలేక ఇబ్బందిపడే ట్రయిలర్ ఒకటి వచ్చింది. అదే ఇష్క్.
తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఇష్క్ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. ఈ ట్రయిలర్ చూస్తే కథ ఏంటనేది ఊహించడం చాలా కష్టం. అంతేకాదు.. సినిమా జానర్ చెప్పడం కూడా అంతే కష్టంగా మారుతుంది.
కాసేపు లవ్ చూపించారు, ఇంకాసేపు ఎమోషన్ పండించారు. అంతలోనే సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను చూపించారు. దీంతో ఇష్క్ సినిమా కథ ఏమై ఉంటుందా అనే సస్పెన్స్ అందర్లో ఉంది. ట్యాగ్ లైన్ లో చెప్పినట్టు ఇది కచ్చితంగా లవ్ స్టోరీ మాత్రం కాదనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది.
నిజానికి ఇది కొత్త కథ కాదు, ఆ మాటకొస్తే ఇదొక రీమేక్ సినిమా. మేకర్స్ ఆ విషయాన్ని పెద్దగా ఎలివేట్ చేయడం లేదు. పైగా ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా చాలా తక్కువ మంది. మలయాళం వెర్షన్ చూడని వాళ్లకు ఈ సినిమా ట్రయిలర్ కచ్చితంగా నచ్చుతుంది.
ట్రయిలర్ లో పక్కింటి కుర్రాడి లుక్స్ లో తేజ, పక్కింటమ్మాయి లుక్స్ లో ప్రియా వారియర్ బాగానే కుదిరారు. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఈనెల 30న థియేటర్లలోకి వస్తోంది ఇష్క్. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా అవ్వడంతో టోటల్ ఇండస్ట్రీ దృష్టి మొత్తం దీనిపై పడింది. దీంతో పాటు సత్యదేవ్ నటించిన తిమ్మరుసు కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.