ఎక్కడ స్త్రీలు గౌరవాన్ని అందుకుంటారో అక్కడ దేవతలు ఉంటారని చెబుతారు. ఇది నిన్నటి మాట. ఎక్కడ అబద్ధం రాజ్యమేలుతుంటుందో అక్కడ చంద్రబాబు ఉంటారు. ఇది నేటి మాట.
అబద్ధాలాడినా అతికినట్టు ఉండాలనేది నిన్నటి మాట. కానీ అబద్ధాలు చెప్పినా బాబులా చెప్పాలనేది నేటి మాట. అబద్ధాలు చెప్పే విద్యను నేర్పించడానికి ఓ విశ్వవిద్యాలయాన్ని పెట్టాలనుకుంటే, దానికి చంద్రబాబు పేరే పెట్టాలని జనం ఏకాభిప్రాయం.
అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను చంద్రబాబు ఏనాడో మించిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు తప్పుడు పనులు చేసేందుకు ఉసిగొల్పుతూ, మరో వైపు ప్రత్యర్థులపై నెపాన్ని నెట్టడంలో బాబు తన అనుభవాన్నంతా ఖర్చు చేస్తున్నారని చెప్పొచ్చు.
అయితే బాబు ఎత్తులను చిత్తు చేసే జనరేషన్ పుట్టుకు రావడంతో ఆయన పాచికలు పారడం లేదు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు బాబు చేసిన ఎత్తులను అధికార వైసీపీ చిత్తు చేసింది.
ఒకవైపు తన పార్టీకి చెందిన న్యాయవాదితో నిందితులకు బెయిల్ ఇప్పించిందనే సమాచారం బయటికి రావడంతో టీడీపీ మరోసారి తాను తీసుకున్న గోతిలో తానే పడింది. ఈ నేపథ్యంలో బాబు మరోసారి కుల, మత ప్రస్తావన తీసుకురావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఒక ఘటనను తీసుకుని, పొంతన లేని వాదన తీసుకురావడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. రాష్ట్రం నేరగాళ్ల రాజ్యమైందని, అరాచక శక్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, సామాన్యుల ప్రాణాలు తీస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం నోరు తెరవలేదని బాబు విమర్శించారు.
నిన్నటికి నిన్న నంద్యాల ఘటన తనను కలచి వేసిందని, ఆ విషయం తెలియగానే నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అయితే నిందితులకు వెంటనే బెయిలు వచ్చిందని, రద్దు చేయాలని పైకోర్టుకు వెళుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఇవేవీ చంద్రబాబుకు వినిపించవు, ఎంత సేపూ తను చెప్పిందే ప్రచారంలోకి రావాలని ఆయన కోరుకుంటారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని ప్రభుత్వం…. పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా? అని జగన్ సర్కార్‌ను బాబు హేళన చేశారు.
ఇంత వరకూ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎవరి హయాంలో కట్టారో బాబు గుర్తు చేసుకుంటే మంచిది. ఎన్టీఆర్ హయాంలో ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన మాట వాస్తవమే. కానీ నీటి ప్రాజెక్టులు, వ్యవసాయంతో సంబంధం లేదన్నట్టు పాలించిన చంద్రబాబు కూడా పోలవరం గురించి మాట్లాడ్డం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా?.
ఎన్నికలకు ముందు తన పార్టీ మీటింగ్‌లో నిరసన గళం వినిపించారని కొంత మంది ముస్లిం యువకులపై ఎలాంటి కేసులు పెట్టారో చంద్రబాబుకు గుర్తు ఉంటే … ఇప్పుడు ఇలా మాట్లాడేవారు కాదేమో!