పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి తెలుగుదేశం అనుకూల మీడియా కొత్త రాద్ధాంతం మొదలుపెట్టిన నేపథ్యంలో, యథారీతిన విషం కక్కుతున్న పరిణామాల్లో.. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తుతో ముడిపడిన అంశాల గురించి కూలంకషమైన విశ్లేషణ ఇది.
పోలవరం ఎత్తు మట్టం కాదు 360 టీఎంసీల నీటి సరఫరా సాధన ముఖ్యం. 150 ఎత్తును 135 అడుగులకు తగ్గించినా ప్రయోజనాలలో మార్పు లేనపుడు భావోద్వేగాలతో కూడిన చర్చ కాకుండా బాధ్యత ఆలోచించాలి.
పోలవరం ప్రాధాన్యత……
ఆంద్రప్రదేశ్ నీటి అవసరాలను తీర్చేది ప్రధానంగా గోదావరి , కృష్ణా నదులు. కృష్ణ నీటిని మిగులు జలాలతో సహా పంపిణీ చేసిన నేపద్యంలో అపారమైన నీటి లభ్యతకు అవకాశం ఉన్న గోదావరిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణా డెల్టా , గోదావరి , విశాఖ నగర మరియు పారిశ్రామిక అవసరాలకు గోదావరి నీరే ప్రదానం.
అలా పోలవరం కీలక ప్రాజెక్టు అనడంలో సందేహం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా , గోదావరి , విశాఖనగర మరియు పారిశ్రామిక అవసరాలకుగాను దాదాపు 360 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
పోలవరం నీటి నిల్వ ప్రాజెక్టు కాదు….
ప్రస్తుత డిజైన్ 150 అడుగులు నిల్వ 196 టీఎంసీలు. కుడికాలవ ( పట్టిసీమ) కృష్ణా డెల్టా. ఎడమకాలువ (పురుషోత్తపట్నం) గోదావరి మరియు విశాఖ అవసరాలు. ఈ కాల్వల ద్వారా 360 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇక్కడే కీలక విషయం పరిశీలన చేయాలి.
196 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేసి అందులో డెడ్ స్టోరేజ్ పోను అవకాశం ఉన్నది దాదాపు 150 టీఎంసీలే మరి 360 టీఎంసీల నీరు ఎలా తీసుకుంటారు. అంటే పోలవరం నాగార్జున సాగర్ , శ్రీశైలం లాగా నిల్వ ఉంచిన నీటిని సరఫరా చేసే ప్రాజెక్టు కాదు. గోదావరి 120 రోజులు ప్రవాహం ఉంటుంది. కనుక గ్రావిటీతోనే కుడి , ఎడమ కాల్వలకు నీరు డ్రాచేసుకునే అవకాశం ఉండేవిధంగా ఎత్తుమట్టం ఉంటే సరిపోతుంది.
పోలవరం , గోదావరినది పై కోస్లా నిపుణుల కమిటీ , CWC ల పరిశీలన….
గోదావరినదిని కేంద్రప్రభుత్వ పరిధిలోని CWC 29 సంవత్సరాలు పరిశీలించిన పిదప ఒక నివేదికను విడుదల చేసింది. అనేక అంశాలు ఉన్నప్పటికి పోలవరంతో ముడిపడి ఉన్న అంశాలు వరకే చర్చకు పెడుతున్నాను. గోదావరి నది పెద్ద స్థాయిలో నీటిని తీసుకు వస్తుంది. ముఖ్యంగా పోలవరం సమీపంలో 51 కిలోమీటర్ల పొడవు , 2 కిలోమీటర్ల వెడల్పుతో నది ఉదృతంగా ప్రహిస్తుంది.
ఈ మధ్య వచ్చిన వరదలలో కూడా దాదాపు 70 టీఎంసీల ప్రవాహం కొన్ని రోజుల పాటు ఉన్నది. ఇంతకు 2 , 3 రేట్లు కూడా చరిత్రలో నమోదు అయినది. కీలక విషయం ఈ ప్రాంతంలో రోజుల వ్యవధిలో 30 టీఎంసీలు సిపేజి (సాదారణ భాషలో ఆవిరి , నీరు ఇంకడం) ఉంటుంది.
జియాలజిస్టులు కూడా సిపేజిని గుర్తించినారు కానీ అందుకు గల కారణాలపై మరింత అధ్యయనం చేయాలని చెపుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా నీటిని నిల్వ చేసినా సిపేజి వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రవాహం ఉన్నపుడే నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం ఒక్కటే పరిస్కారం.
కీలకమైన మరో అంశం రాయలసీమలోని శ్రీశైలం డ్యాం ఉన్న ప్రాంతం రాతితో కూడిన నేల. అదే పోలవరం శాండ్. గోదావరితో పోల్చుకుంటే తక్కువ ప్రవాహం కలిగిన శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో చాలాసార్లు ఆందోళన కలిగింది. అలాంటిది శాండ్ స్వభావం కలిగిన భారీ నీటి ప్రవాహం ఉన్న ప్రాంతంలో ఎక్కువ ఎత్తు మట్టంతో ప్రాజెక్టు నిర్మించి భారీగా నీటిని నిల్వ చేయడం రాజమండ్రితో సహా దిగువ ప్రాంతానికి భద్రత రీత్యా 150 అడుగులు సముచితమా ? అన్న కోణంలో కూడా ప్రభుత్వాలు పరిశీలన చేయాలి.
135 అడుగులతోనే 150 అడుగుల ప్రయోజనం పొందే అవకాశాలను నిరాకరించడం తగదు…..
పోలవరం ప్రధాన ప్రయోజనం 360 టీఎంసీల నీరు డ్రా చేయడమే. కుడికాలవకు 131 అడుగులతో నీటి విడుదల చేయవచ్చు. ఎడమ కాలువకు 132 అడుగులతో విడుదల చేయవచ్చు. గోదావరి 120 రోజుల ప్రవాహం ఉంటుంది. కుడి , ఎడమ కాలువల ప్రస్తుత సామర్ధ్యం రోజుకు 17500 క్కుసెక్వ్యూలు.
ఉభయ కాల్వల సామర్థ్యం కలిపితే రోజుకు 3 టీఎంసీలు. 120 రోజులు ప్రవాహం ఉంటుంది కాబట్టి 360 టీఎంసీల నీరు తీసుకోవడానికి 135 అడుగులు సరిపోతుంది. భవిష్యత్తులో అదనపు నీరు డ్రా చేయాలనుకుంటే కాల్వల సామర్ధ్యం పెంచుకోవడం కష్టం కాదు. కోస్లా నిపుణుల కమిటీ రెండు కాల్వలకు నీరు విడుదలకు సరిపడ స్థాయిలో మాత్రమే ప్రాజెక్టు ఎత్తుమట్టం ఉండాలని స్పష్టం చేసింది. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్ని కేయల్ రావు గారు వ్యక్తం చేశారు.
పోలవరం ప్రయోజనాలలో వ్యత్యాసం లేనపుడు. వేలకోట్ల రూపాయల ప్రజాధనం , పెద్ద సంఖ్యలో నిర్వాసితుల సమస్య , డ్యాం భద్రత , రాజమండ్రి నగరంతో సహా క్రింద ప్రాంత ప్రయోజనాలతో ముడిపడిన పోలవరం ఎత్తు విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలి….
ఎత్తు మాట్టాన్ని సైజు తో కొలవడం అవగాహన లేమి మాత్రమే..
ఎత్తుమట్టం పై చర్చ జరిగినపుడు చాలామంది అవగాహన లేమితో మాట్లాడేది సైజు. సాధారణంగా చిన్న పాత్ర కన్నా పెద్ద పాత్రలో ఎక్కువ నీటిని ఉంచవచ్చు. కానీ ఇంతకు ముందు ప్రస్తావన చెసినట్లు మిగిలిన జలాశయాల లాగా పోలవరం నీటినిల్వ ప్రాజెక్టు కాదు.
120 రోజుల పాటు ప్రవాహం ఉన్నపుడే నీటిని డ్రా చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇదే నదిపై కాటన్ బ్యారేజి ఉన్నది. దాని సామర్థ్యం 1.5 టీఎంసీలు. దాని వలన సాగు చేస్తున్న విస్తీర్ణం 10 లక్షల ఎకరాల 1 టీఎంసి నీరు 10 వేల ఎకరాలకు సరిపోతుంది. 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న కాటన్ బ్యారేజి 10 లక్షల ఎకరాల భూమి ఎలా సాగుబడి అవుతుంది అంటే 120 రోజుల పాటు గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి. అదే సూత్రం పోలవరం ప్రాజెక్టుకు వర్తిస్తుంది.
పోలవరం ఎత్తుమట్టంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు……
నేడు పోలవరం ఎత్తుమట్టంపై జరిగే చర్చలో రాజకీయ కోణం ప్రధానంగా కనిపిస్తుంది. కేసీఆర్ , జగన్ మైత్రి వలన తెలంగాణ కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శలు. వారి ఇద్దరి రాజకీయ మైత్రిపై నేను వివరణ ఇవ్వడం లేదు. కానీ పోలవరం ఎత్తుమట్టం చుట్టూ తెలంగాణ ప్రయోజనాలు లేవు అని మాత్రం చెప్పగలను.
1. పోలవరం ప్రాజెక్టు ఉన్నది తెలంగాణ రాష్ట్రం తర్వాత అన్న విషయం మరిచిపోకూడదు. పోలవరంలో ఎక్కువ నీరు నిలిపితే సముద్రంలోకి వెళ్లే నీరు తగ్గుతుంది. అదే నిల్వచేయకపోతే సముద్రంలోకి వెళుతుంది.
2. ఒక వేల నిర్వాసితుల సమస్య అనుకుంటే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన తర్వాత ఆ అంశానికి కూడా ప్రాధాన్యత లేదు.
3. గోదావరి నది ఎక్కువ దూరం ప్రవహిస్తున్న రాష్ట్రం తెలంగాణ కానీ వారు గ్రావిటీతో నీరు వాడుకోలేని పరిస్థితి. ఒక వేల మొత్తం గోదావరి నీటిని వారి రాష్ట్రంలో నిలుపుకున్నా ( అసాధ్యం) పోలవరం ప్రాజెక్టు నీటి లభ్యతకు భయం లేదు.
కారణం తెలంగాణతో సంబందం లేకుండా పుష్కలంగా గోదావరి ఉపనది శబరి నీటిని తీసుకువస్తుంది. అందుకే 7 ముంపు మండలాలను ఏపీలో కలిపిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సహకరించినా సహకరించకపోయినా పోలవరం ఆగదు. కేంద్రం మరియు ఒడిశా , ఛత్తీస్ గడ్ రాష్ట్రాలతో మాత్రమే సాంకేతికంగా సమస్యలు ఉంటాయి.
విద్యుత్ ప్లాంట్ కోసమే జగన్ రివర్స్ టెండరు ప్రక్రియ అనడం కూడా రాజకీయమే.
తాజాగా వినిపిస్తున్న విమర్శ రివర్స్ టెండరు ప్రక్రియ ద్వారా జగన్ విద్యుత్ ప్లాంట్ వసపరుచుకోవడం ఉద్దేశ్యం అన్న విమర్శలు కేవలం రాజకీయమే. ఎందుకంటే పోలవరం ఎత్తుమట్టం 150 అడుగులు ఉద్దేశ్యం విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే. నిర్వాసితుల సంఖ్య కుదించి కేంద్రంలో పెరు కోసం జగన్ తాపత్రయం అని విమర్శిస్తున్నవారు గుర్తించు కోవాల్సిన విషయం ఎత్తు మట్టం 150 నుంచి 135 అడుగులకు తగ్గిస్తే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. మరి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కోసం జగన్ ప్రయత్నాలు అన్న దానికి అర్థం లేదు.
నేను ప్రతిపాదిస్తుంది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. విధానపరమైన కమిటీల నివేదికలలోని సిపార్సులను ఒక చోటికి చేర్చడం మాత్రమే నేను చేసింది. నీటి ప్రాజెక్టుల విషయంలో అపారమైన అనుభవం మరియు అధికారులు ఉన్న CWC , కోస్లా నిపుణుల కమిటీల సిపర్సులు. కేయల్ రావు గారు , పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి గొప్పవారి చూచనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ఎత్తుమట్టం విషయంలో నిర్ణయం తీసుకోవాలి…..
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం
9490493436