టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి , ప్రజలు, ప్రత్యక్ష ఎన్నికలతో ఎలాంంటి సంబంధం లేదు. అలాంటి నాయకుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తలపడేందుకు రావాలని అధికార వైసీపీకి సవాల్ విసురుతున్నారు.
కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ఇది అనువైన సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే, కాదు కాదు, ప్రజా వ్యతిరేకతకు భయపడి అధికార పార్టీ వెనక్కి తగ్గుతోందని యనమల రామకృష్ణుడు రెచ్చగొడుతున్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయం వల్లే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసీపీ వెనుకంజ వేస్తోందని విమర్శించారు. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసీపీ ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వ బాధితు లంతా వ్యతిరేకంగా ఓటేస్తారని వైసీపీ భయపడుతోందని విమర్శించారు.
ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల్లో వ్యతిరేకత చూసే వెనక్కితగ్గుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావాలని ఆయన సవాల్ విసిరారు.
యనమల మాటలు కోటలు దాటుతాయని, చేతలు గడప దాటవని అంటుంటారు. ఎన్నికల గురించి సవాల్ విసురుతున్న యనమల చివరిగా తాను ఎన్నికల్లో ఎప్పుడు పాల్గొన్నారో కనీసం ఆయనకైనా గుర్తుందా? 11 ఏళ్లుగా ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత 2009లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి యనమల కుటుంబానికి వరుస పరాజ లు తప్పడం లేదు.
యనమల ఓటమి తర్వాత ఆయన సోదరుడు కృష్ణుడు తుని నుంచి టీడీపీ తరపున బరిలో నిలిచారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో యనమల తమ్ముడికి పరాభవం తప్పలేదు.
తునిలో యనమల కుటుంబం అంటే వణికిపోయే పరిస్థితి ఉందంటారు. 2009లో యనమల ఓటమి తర్వాత 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిని రెన్యువల్ చేసుకుంటూ …. ప్రజలు, ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా మీడియాలో యనమల కాలం వెల్లదీస్తున్నారు.
అలాంటి యనమల రామకృష్ణుడు కూడా వైసీపీకి తొడ కొట్టడం కాస్తా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల్లో నిలిచి గెలుపో, ఓటమో స్వీకరించే వాళ్లు సవాళ్లు విసిరితే వినసొంపుగా ఉంటుంది కానీ, వాటికి సంబంధం లేని యనమల మాట్లాడ్డం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికలంటే భయపడుతోందని యనమల విమర్శిస్తూ , దమ్ముంటే రావాలని తొడకొడుతున్న యనమలను చూసి సవాల్ అనేది సిగ్గుపడుతోందనే అభిప్రాయాలు వ్యక్వమవుతున్నాయి.
మరి తమ హయాంలో జరగాల్సిన స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో అపర మేధావి అయిన యనమల సమాధానం ఇచ్చి , మిగిలిన విషయాలు మాట్లాడితే బాగుంటుందని పలువురు హితవు చెబుతున్నారు.