తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ఆ పార్టీ నాయకులు దాదాపుగా ప్రకటించేశారు. జనసేన-బీజేపీ కలసి పోటీ చేస్తాయంటూనే.. బీజేపీకి చెందిన వ్యక్తే బరిలో దిగుతారని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా కనీసం జనసేనతో సంప్రదింపులు జరిపారా లేదా అనేది కూడా తెలియదు. ఒక రకంగా తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందనేది వాస్తవం.
ఈ విషయంపైనే పవన్ కల్యాణ్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అసంతృప్తినంతా జనసేనాని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా బైటపెట్టారు. ఒక రకంగా బీజేపీపై బ్లాక్ మెయిలింగ్ కి దిగారు.
తిరుపతి విషయంలో తనను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న బీజేపీకి జీహెచ్ఎంసీ బరిలో అభ్యర్థుల్ని దించుతున్నానంటూ షాకిచ్చారు. దీంతో అటు బీజేపీ కూడా తల పట్టుకుంది, తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని పైకి చెబుతున్నా.. అలా జరపాలని ఆ పార్టీ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇరు వర్గాలు గుంభనంగా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన ఇంకా కలసి చర్చించుకోలేదు. ఒకవేళ అలా చర్చలకు దిగితే తిరుపతి ప్రస్తావన తీసుకు రావాలనుకుంటున్నారట పవన్. 2014లో జరిగిన తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
ఆ విషయాన్ని ప్రముఖంగా వారికి గుర్తు చేయాలని, మీకంటే మేమే తిరుపతిలో బెటర్ అని చెప్పాలని, అభ్యర్థిని నిర్ణయించే విషయంలో తమ వాదన కూడా పరిగణలోకి తీసుకునేలా డిమాండ్ చేయాలనేది పవన్ కల్యాణ్ ఆలోచన.
అందుకే ఆయన గ్రేటర్ లో నిప్పు రాజేశారు. ఆ సెగ బీజేపీకి ఆల్రడీ తగిలినప్పటికీ పైకి ఆ నొప్పి తెలియనివ్వడం లేదు. పవన్ దగ్గరకి రాయబారం పంపితే మరింత బెట్టు చేస్తారనే ఉద్దేశంతో.. హైకమాండ్ తో ఆయనకి చెప్పించాలని చూస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిత్వం విషయంలో జనసేన మాటకు విలువ ఇవ్వాలనేది పవన్ వాదన. అందుకే ఆయన గ్రేటర్ ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కి దిగారు.