అమెరికాలో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు, అమెరికన్ చదువుల కలలో ఉన్న మరిన్ని లక్షలాది మంది విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికాలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ ఉండటంతో అనేక మంది భారత విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. వర్సిటీలు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో చాలా మందికి స్వదేశానికి రావాలనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఒక్కసారి ఇండియాకు వస్తే, మళ్లీ అమెరికాలో అడుగు పెట్టడం తేలిక కాదనే భయాలతో అనేక మంది అక్కడే ఉండిపోతూ ఉన్నారు. కరోనా భయాల నేపథ్యంలో కూడా చదువుల కోసం కట్టిన ఫీజులు, చదవాలనే కలలతో వారు అక్కడే ఆగిపోయారు.
ఈ క్రమంలో అమెరికన్ ప్రభుత్వం విద్యార్థులపై మరో రకంగా కత్తి గట్టినట్టుగా తెలుస్తోంది. ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే మాత్రానికే అయితే .. అమెరికాలో ఉండనక్కర్లేదని, వారు స్వదేశాలకు తరలిపోవాలని అమెరికా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసుల ద్వారా కోర్సులు చేసేట్టు అయితే.. ఇక అమెరికా ఉండటం ఎందుకు? అంటూ అమెరికన్ ప్రభుత్వం లాజిక్ తీస్తోందట.
కేవలం వర్సిటీలకు, కాలేజీలకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే అమెరికాలో ఉండాలని మిగతా వాళ్లు వారి వారి దేశాలకు వెళ్లిపోవాలంటూ అమెరిక ప్రభుత్వం చెబుతున్నట్టుగా సమాచారం. కరోనా భయాల వేళ కూడా ఏ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ విద్యార్థులు అక్కడే ఉన్నారో, ఆ విషయంలోనే అమెరికా ప్రభుత్వం ఝలక్ ఇస్తోంది. ఇప్పుడు అమెరికా సాగనంపే విద్యార్థులను మళ్లీ అక్కడ అడుగుపెట్టనిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారానే చదువుకునే వాళ్లు చదువుకోవచ్చని, కొత్త వీసాల జారీ ప్రశ్నార్థకమే అనే పరిస్థితిని కల్పిస్తోంది అమెరికన్ ప్రభుత్వం.
యూఎస్ లో దాదాపు 10 లక్షల మంది వివిధ రకాల కోర్సులను అభ్యసిస్తూ ఉన్నారని అంచనా. వీరిలో భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. చైనా, ఇండియా, కెనడాల నుంచి ప్రతియేటా లక్షలాది మంది చదువుకోసం అమెరికా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వారిందరికీ జాయింటుగా అమెరికన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అయితే కరోనా పరిస్థితుల వేళ కూడా తాము కాలేజీలకు అటెండ్ అవుతున్నట్టుగా చూపించుకోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్లారు చాలా మంది విద్యార్థులు. వర్సిటీలకు వెళ్తున్నట్టుగా చూపించగలిగితే వారు అక్కడే ఉండవచ్చట. ఇలా యూఎస్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి.