అవును మరి అణగదొక్కితే అలాగే ఉంటుంది. మాకూ పౌరుషం లేదా, పంతం రాదా అనిపిస్తుంది. ఉత్తరాంధ్రా అంటే అలుసు. ఉత్త మాలోకాలని బయటోళ్ళకు తల బిరుసు. కాలం మారిందిగా, ఎపుడూ ఒకేలా ఉండదు కదా. అందుకే ఇక్కడ జింకలు కూడా ఇపుడు పులులవుతున్నాయి.
మా బాగోగులు పట్టించుకోకుంటే పాతరేస్తామంటూ టీడీపీ అయిదేళ్ళ పాలనకు చరమగీతం పాడి ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని దారుణ పరాభవాన్నిరుచి చూపించారు ఉత్తరాంధ్ర ప్రజానీకం.
మొత్తం 34 ఎమ్మెల్య్సే సీట్లు ఉంటే అచ్చంగా ఆరు మాత్రమే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలుచుకున్న సైకిల్ పార్టీకి ఇపుడు సెగలు పుట్టించేలా విశాఖ రాజధాని మాకు కావాలంటున్నారు.
అడ్డుతగిలితే అంతే సంగతులు అని కూడా గట్టిగానే చెబుతున్నారు. ఇక వైసీపీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరకు సౌమ్యుడని పేరు. ఆయన గిరిజన నాయకుడు. మంచికి, మానవత్వానికి పెట్టింది పేరు.
అటువంటి అలుగుటయే ఎరుగని రాజన్న దొర ఒక్కసారిగా గర్జించారు. అలా ఇలా కాదు, విశాఖ రాజధాని ఎందుకు కాదో చూస్తామంటూ హాట్ కామెంట్లు చేశారు.
విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర బతుకులు బాగుపడతాయి అని దొర అంటున్నారు. కాదూ కూడదని అడ్డుకుంటే మాత్రం ఏకంగా ఉత్తరాంధ్ర రాష్ట్రమే ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆయన గట్టిగా చెప్పేస్తున్నారు. మొత్తానికి దొర గర్జనతో బడుగు బలహీన జనం గొంతుక ఏంటో, వారి సత్తా ఎలా ఉంటుందో విశాఖ రాజధాని వద్దంటున్న వారు ఆలోచించుకుంటే మంచిదేమో.
ఇంతకాలం పల్లకీ మోసిన ఈ ప్రాంతాలు, దూరాభారం అని చూడకుండా నాడు మద్రాస్ రాజధానిని, తరువాత కర్నూలుని, ఆ తరువాత హైదరాబాద్ ని, మధ్యలో అమరావతిని కూడా చూసి వచ్చాయి.
మరి ఇపుడు విశాఖ రాజధాని అంటే దూరం, కడు భారం అంటూ నొసలు చిట్లించే వారికి ఇదే తగిన గుణపాఠం కావాలని అంటున్నారు. ఇస్తే రాజధాని, లేకపోతే రాష్ట్రమేనన్నది మేధావులు, ప్రజాసంఘాల గట్టి మాటగా కూడా ఉంది.