నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితుల్ని మరో 3 రోజుల్లో ఉరి తీయబోతున్నారు. ఈ మేరకు తీహార్ జైలులో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్నట్నుంచి రిహార్సల్స్ కూడా మొదలయ్యాయి. దోషుల ఎత్తు, బరువు ఆధారంగా 4 బ్యాగులు తయారుచేస్తారు. ఇసుక, గోధుమలతో నింపి ఆ బ్యాగుల్ని ఉరి తీస్తారు. ఉరికి ముందు ఇలా చేస్తారు.
ఉరి తీసే సమయంలో ఎలాంటి టెక్నికల్ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఇలా 3 రోజుల ముందు నుంచి రిహార్సర్స్ చేస్తారు. ఇందులో భాగంగా నిన్న చేసిన ట్రయిల్స్ సక్సెస్ అయ్యాయి. ఈ రిహార్సల్స్ ను ఈరోజు, రేపు కూడా 3-4 సార్లు రిపీట్ చేస్తారు. రిహార్సల్స్ కోసం ఉపయోగించిన బస్తాల్లో ఉన్న ఇసుక, గోధుమల్ని ఎవ్వరూ వినియోగించరు. వాటిని దూరంగా పడేస్తారు.
ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నిందుతుల్ని ఉరి తీయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే మీరట్ జైలు నుంచి ఉరి తాళ్లను తెప్పించారు. ఆ తాళ్లను కూడా పరీక్షిస్తున్నారు. మరోవైపు దోషులు తమ తల్లిదండ్రులు, బంధువుల్ని కలుసుకునే ఏర్పాట్లు చేశారు. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ ను నిన్న అతడి భార్య, తల్లి కలుసుకున్నారు. ఉరి తీసే లోపు ఈ 3 రోజుల్లో మరోసారి కలుసుకునే అవకాశం కూడా ఉంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్య కేసులో వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్, పవన్ ను దోషులుగా నిర్థారించారు. వీళ్లు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. ప్రస్తుతానికైతే ఉరి నుంచి తప్పించుకునే ఏ ఒక్క అవకాశం వీళ్లకు లేదు. అన్ని దారులు మూసుకుపోయాయి. ఫిబ్రవరి 1న ఈ నలుగురి ఉరి ఖాయం.