వ్యాక్సినేషన్ విషయంలో ఇంతకీ దేశంలో ఏం జరుగుతోంది? అనేది అంతుబట్టడం లేదు. కరోనా సెకెండ్ వేవ్ లో విజృంభించబట్టి కూడా మూడు నెలలు గడుస్తున్నా.. వ్యాక్సినేషన్ మాత్రం ఊపందుకోవడం లేదు! ఈ వ్యవహారం ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య 20 కోట్లను దాటినట్టుగా ఉంది. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ ఊపందుకోవాల్సిందో.. అప్పుడే.. పూర్తిగా మందగమనంలో సాగుతున్నట్టుగా మారింది వ్యవహారం.
ప్రత్యేకించి రెండే వ్యాక్సిన్ల మీద ఆధారపడటంతో.. పరిస్థితి మరీ ఇంత దయనీయంగా మారిందని స్పష్టం అవుతూనే ఉంది. కో వ్యాగ్జిన్ ను ఇతర కంపెనీల ద్వారా ఉత్పత్తి చేసేందుకు అనుమతులు అంటూ ఆ మధ్య ఒక ప్రకటన చేశారు. అదెంత వరకూ వచ్చిందో కూడా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు స్పష్టతను ఇవ్వనే లేదు!
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా.. మూడో వేవ్ అంటూ స్వయంగా కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీనే భయపెడుతున్నా… వ్యాక్సినేషన్ మాత్రం ఆ పరిస్థితులకు అనుగుణంగా సాగడం లేదు. కేంద్రం అందించాలే గానీ భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ను జరిపించడానికి అనుగుణంగా తాము సన్నద్ధంగా ఉన్నట్టుగా రాష్ట్రాలు చెబుతున్నాయి.
ఈ అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలనలు గమనిస్తే.. తొలి డోస్ వేయించుకున్న వారికి రెండో డోస్ దొరకడం లేదు, ప్రస్తుతం వేస్తున్న వ్యాక్సిన్లు 45 యేళ్ల పై వయసు వారికే, అది కూడా తొలి డోస్ అయితేనే వస్తున్నారు. రెండో డోస్ కోసం వెయిట్ చేస్తున్న వారికి నిరాశ తప్పడం లేదు. సెకెండ్ వేవ్ లో కరోనా 45 యేళ్ల లోపు వయసు వారినీ ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో.. అందరికీ భీతి పెరిగింది. ఇలాంటప్పుడు 45 యేళ్ల లోపు వారిని ప్రభుత్వాలు గాలికి వదిలిపెడుతున్నట్టుగా మారింది పరిస్థితి.
రోజుకు కోటి వ్యాక్సిన్ డోసుల డిమాండ్ ఉండగా.. 20 లక్షల స్థాయిలో వ్యాక్సిన్లు వేస్తూ ఉన్నారు. నెలలు గడుస్తున్నా ఈ పరిస్థితి మాత్రం మారడం లేదు! ఈ విషయంపై మోడీ ప్రభుత్వం ఏ మేరకు దృష్టి పెడుతోంది.. వ్యాక్సినేషన్ ఎప్పటికి ఊపందుకుంటుందనేది సమాధానం లేని ప్రశ్నగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇలాంటి అస్పష్టత ఏమిటనేది అంతుబట్టని అంశం.
మరోవైపు విదేశాల్లో ఎక్కువ వ్యాక్సిన్లకు అనుమతులు ఇస్తుండటాన్ని కూడా గమనించవచ్చు. ఇప్పటికే తమ దేశంలో సగం పౌరులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన బ్రిటన్ కూడా తాజాగా మరో వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్కువ జనాభాతో ఉండి.. వారిలో కూడా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలే వ్యాక్సిన్ల ఇంకా కసరత్తును కొనసాగిస్తూ ఉన్నాయి. ఇండియాలో మాత్రం వ్యాక్సినేషన్ ఊపందుకోవడం లేదు! ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సామాన్యుల్లో తీవ్ర అసహనం ఉంది. అయినా.. నిమ్మకు నీరెత్తినట్టుగానే అగుపిస్తోంది పరిస్థితి.