మొన్నటికిమొన్న క్వారంటైన్ ప్యాకేజీ పేరిట హోటల్స్ ఎలా దండుకున్నాయో చూశాం. వారం రోజుల క్వారంటైన్ కు లక్ష రూపాయలకు పైగా ఛార్జీలు వసూలు చేసిన హోటల్స్ ను చూశాం. ఇప్పుడు ఇదే ప్యాకేజీ క్వారంటైన్ నుంచి టీకాకు మారింది.
అవును.. హైదరాబాద్ లో కొన్ని హోటల్స్ ఇప్పుడు టీకా ప్యాకేజీలు ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీకాకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఇవి ఈ ప్యాకేజీని ప్రకటించాయి. ఈ ప్యాకేజీలు 5వేల రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్య ఉన్నాయి. తమ హోటల్ కు వచ్చి టీకీ వేయించుకొని, ఆతిథ్యం స్వీకరించమని కోరుతున్నాయి ఈ హోటల్స్.
టీకా కోసం ఉదయాన్నే వస్తే బ్రేక్ ఫాస్ట్, రూమ్ ఉచితం, అదే టీకా కోసం మధ్యాహ్నం టైమ్ లో వస్తే లంచ్, రూమ్ ఇస్తున్నారు. వీటితో పాటు ఎప్పుడూ ఉన్నట్టే వైఫై, వెల్ కం డ్రింక్ అంటూ ఊరిస్తున్నాయి. నగరంలో ఇలాంటి సేవల్ని 2-3 హోటల్స్ అందిస్తున్నాయి. దీనికి సంబంధించి 10వేల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు.
కాస్త డబ్బులు పెట్టగలిగి, జనసమ్మద్ధం లేకుండా ప్రశాంతంగా టీకా వేయించుకోవాలనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షనే. కాకపోతే వీటి కోసం సామాన్యులకు టీకా అందుబాటులో లేకుండా చేస్తే మాత్రం అదో పెద్ద మోసం అవుతుంది. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల టీకా బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్టార్ హోటల్స్ కూడా రంగంలోకి దిగితే సామాన్యుడికి టీకా దొరుకుతుందా?