కరోనా కు సంబంధించిన ఒమిక్రాన్ వేరియెంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. ఈ వేరియెంట్ వేగంగా వ్యాపిస్తోందనే వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ లో నాలుగో డోసు వ్యాక్సినేషన్ చేయిస్తోందట అక్కడి ప్రభుత్వం! ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా నాలుగో డోసు వ్యాక్సినేషన్ చేయిస్తోంది ఇజ్రాయెల్. ఇక అమెరికాలో ఇప్పటికే బూస్టర్ డోస్ వేయించడం మొదలై నెలలు గడిచిపోయాయి. యూకేలో ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరుకుందట. అదే అమెరికాలో ప్రస్తుతం వస్తున్న కేసుల్లో ఏకంగా 70 శాతం ఒమిక్రాన్ వేరియెంట్ వేనట!
ఇక ఇండియాలో కూడా ఒమిక్రాన్ వేరియెంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి దిగుతున్న వారికి పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతి ఐదు మందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలుతోందనే గణాంకాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అది కూడా వారిలో కామన్ గా ఒమిక్రాన్ వేరియెంటే బయటపడుతోందట. ఇక ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇండియా వైపు వచ్చే వారిలో కూడా చాలా మంది ఒమిక్రాన్ ను వెంటేసుకు వస్తున్నట్టుగా వార్తల సారాంశం!
మరోవైపు దక్షిణాఫ్రికాలో కేసులు తగ్గుముఖం పట్టాయనే వార్తలూ వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా తలెత్తిన వేవ్ త్వరగానే తగ్గుముఖం పడుతుందని ఇతర దేశాలు కాస్త ఊరటను పొందవచ్చనేది దక్షిణాఫ్రికాలోని పరిస్థితులను అధ్యయనం చేస్తున్న వారు చెప్పే మాట!
ఆ సంగతలా ఉంటే.. దేశంలో దాదాపు అరవై శాతం ప్రజలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారి శాతం అరవై కాగా, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య మరింత ఎక్కువే అనుకోవాలి.
అయితే.. ఇండియాలో వేసిన కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ లు.. ఒమిక్రాన్ వేరియెంట్ ను ఏ మేరకు అడ్డుకోగలవనేది ప్రశ్నార్థకమే అని పలు అధ్యయనాలు అంటున్నాయి! అస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఒమిక్రాన్ కు విజయవంతంగా చెక్ పెట్టగలుగుతోందని ఆక్స్ ఫర్డ్ అధ్యయనం అంటోంది. అది కూడా బూస్టర్ డోస్ పొందిన వారికే అనేది షరతు! ఒమిక్రాన్ పై ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం.. అయితే ఇప్పటి వరకూ జరిగిన వ్యాక్సినేషన్ తో ఊరట పొందలేమని అంటున్నాయి. అయితే వీటి లోతెంతో ఎవరికీ తెలియదు.
వీటిని చూసి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ మరీ భయానక పరిస్థితిని సృష్టించలేదు. ఎయిడ్స్ పేషెంట్ల సంఖ్య విషయంలో ఎక్కువగా ఉండే దేశమది. వ్యాక్సినేషన్ కూడా తక్కువే. అయినా ఒమిక్రాన్ వేగంగా వ్యాపించింది కానీ, విలయం సృష్టించలేదు. ఇండియా లో ప్రస్తుతం అయితే కేసుల సంఖ్య తక్కువ స్థాయిలోనే ఉంది. ఒమిక్రాన్ సోకిన వారి పరిస్థితి కూడా స్టేబుల్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు.