బాబుకు లేకున్నా, చినబాబుకు చాలా ఉంది..

తండ్రికి లేనిది కొడుకు దగ్గర అంతగా ఏమున్నదబ్బా అని విస్తుపోతున్నారా? అదేనండీ.. కాన్ఫిడెన్స్! అనగా ఆత్మవిశ్వాసం. వచ్చే ఎన్నికల ఊసెత్తాలంటే.. తెలుగుదేశం పార్టీలో నేతలు భయపడిపోతున్నారు. ఇటీవలి వరుస ఎన్నికల్లో తప్పని పరాజయాలు ఆ పార్టీ…

తండ్రికి లేనిది కొడుకు దగ్గర అంతగా ఏమున్నదబ్బా అని విస్తుపోతున్నారా? అదేనండీ.. కాన్ఫిడెన్స్! అనగా ఆత్మవిశ్వాసం. వచ్చే ఎన్నికల ఊసెత్తాలంటే.. తెలుగుదేశం పార్టీలో నేతలు భయపడిపోతున్నారు. ఇటీవలి వరుస ఎన్నికల్లో తప్పని పరాజయాలు ఆ పార్టీ అభిమానుల్ని కూడా పునరాలోచనలో పడే పరిస్థితి కల్పిస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల నాటికి.. తెలుగుదేశం పార్టీ బలం ఎంత ఉంటుందో.. ఎంత సన్నగిల్లిపోతుందో అనేది అందరిలోనూ ఉన్న ఆందోళన. అయితే తెలుగుదేశం పార్టీలో ఎవ్వరిలోనూ కనిపించని కాన్ఫిడెన్స్ చినబాబు నారా లోకేష్ లో కనిపిస్తోంది. ఆయన చాలా డాంబికంగా మాట్లాడుతున్నారు. అది నిజమైన కాన్ఫిడెన్సేనా? లేదా, లోపల భయం పెట్టుకుని.. బయటకు చూపిస్తున్న మేకపోతు గాంభీర్యమా అనేది మాత్రం అర్థం కావడం లేదు. 

నారా లోకేష్.. తాజాగా తనను దారుణంగా ఓడగొట్టిన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. అక్క కొన్ని గ్రామాల్లో ఆక్రమణలతో నిర్మించుకున్న కొన్ని ఇళ్లను ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. వారందరినీ కలిసి, పరామర్శించి.. వారందరికీ సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డే ద్రోహం చేసేస్తున్నాడన్నట్టుగా ప్రచారం చేయడానికి మొత్తానికి నారా లోకేష్ వెళ్లారు. అక్కడొక కొత్త, తమాషా వాదన తెరపైకి తెచ్చారు. 

‘వైసీపీలో చేరుతావా? లేదా, జేసీబీ పంపమంటావా?’ అని లోకల్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి ప్రజలను బెదిరిస్తున్నారట. పేదల ఇళ్లు కూలగొట్టిస్తున్నడట. అయినా.. ఎన్నికలు లేని ఈ సీజన్లో.. పార్టీలో చేరమని ఎవరైనా అడుగుతారా? అయినా.. అధికారపార్టీ గేట్లు తెరిస్తే తెలుగుదేశం నుంచి పోలోమని నాయకులే వలసవెళ్లడానికి సిద్ధంగా ఉండగా.. పేదల్ని పార్టీలో చేరమని బెదిరించే అవసరం ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. మామూలుగా లాజికల్ గా ఆలోచించేవాడికి ఈ డౌటొస్తుంది. కానీ లాజికల్ గా ఆలోచిస్తే లోకేష్ ఎందుకు అవుతాడు?

ఇంతకీ ఆయన కాన్ఫిడెన్స్ ఏ రేంజిలో ఉన్నదంటే.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో నేనే గెలుస్తా.. మీ ఇళ్లన్నీ తిరిగిచ్చేస్తా అంటున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి రాజు ఎవడో బంటు ఎవడో ఎవ్వరికీ తెలీదు. అసలు ఏ పార్టీ ఉంటుందో.. ఏ పార్టీ పుటుక్కుమంటుందో కూడా తెలియదు. 

కుప్పంలో మొన్న మునిసిపాలిటీలో తగిలిన దెబ్బకు.. మళ్లీ గెలుస్తా అని చంద్రబాబునాయుడే కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటిది.. తాము అధికారంలో ఉన్నప్పుడు.. అమరావతి అనే ఎర వేసినప్పుడు.. అడ్డగోలుగా ఓటర్లకు ఏసీలు, ఫ్రిజ్లూ పంచిపెట్టినప్పుడు దారుణంగా ఓడిపోయిన చినబాబు.. వచ్చే ఎన్నికల్లో నేను గెలిచేస్తా అని బీరాలు పలకడం తమాషా కాక మరేమిటి?

ఇంతకీ దీనిని కాన్ఫిడెన్స్ అనొచ్చునా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా?