పనికిరాని పోస్ట్ తో పండగ చేసుకుంటున్న నాని

ఇటీవల విజయవాడలో కేశినేని నాని వర్గీయులు ఎంతగా ఓవర్ యాక్షన్ చేశారో అందరికీ తెలిసిందే. ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బాబు బతిమాలి ఆయన్ను వెనక్కు తెప్పించుకున్నారు. ఇప్పుడు నానికి…

ఇటీవల విజయవాడలో కేశినేని నాని వర్గీయులు ఎంతగా ఓవర్ యాక్షన్ చేశారో అందరికీ తెలిసిందే. ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బాబు బతిమాలి ఆయన్ను వెనక్కు తెప్పించుకున్నారు. ఇప్పుడు నానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో నాని వర్గం రెచ్చిపోతోంది. 

బుద్ధా వెంకన్నకి నాని షాకిచ్చారని అంటున్నారు. ఆ నియోజకవర్గానికి ఇన్ చార్జి పదవిని బుద్ధా వెంకన్న, నాగూల్ మీరా ఆశించారు. కానీ వారిద్దర్నీ పక్కనపెట్టి కేశినేనికి పెత్తనం అప్పగించడంతో నాని వర్గం సంబరపడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో నాని ఎంపీగా, ఆయన కుమార్తె విజయవాడ పశ్చిమలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.

విచిత్రం ఏంటంటే.. ఇప్పటివరకు విజయవాడ పశ్చిమలో ఒకే ఒకసారి టీడీపీ గెలిచింది. 1989 తర్వాత అక్కడ టీడీపీకి ప్రాతినిధ్యమే లేదు. ఆ పోస్ట్ నానికి రావడం విశేషం కాదు, వింత కాదు, దానికి నాని వర్గం రెచ్చిపోవడమే ఇక్కడ వింత, విశేషం. అయితే ఇక్కడ చంద్రబాబు వ్యూహం మాత్రం మరోలా ఉంది. కేవలం కేశినేనిని బుజ్జగించడానికే ఈ పోస్ట్ ఇచ్చారని తెలుస్తోంది.

విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లేకుండానే.. ఎంపీగా గెలిచారు కేశినేని నాని. దీంతో ఎమ్మెల్యేలు గెలవలేకపోయినా తాను గెలిచాననే ధీమా కేశినేనిలో పెరిగింది. ఈ అహంకారంతోనే ఆయన బొండా ఉమ, బుద్ధా వెంకన్న వర్గాలను దూరం చేసుకున్నారు.

అయితే బోండా, బుద్ధ రాజకీయ దాడికి, ఆమధ్య తాను పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్టు అలకబూనారు నాని. అప్పటికప్పుడు ఆయన్ను బుజ్జగించుకుని, ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు చంద్రబాబు. ఒకరకంగా బాబు కూడా పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసిన బుద్ధా, బొండా వర్గాలను దూరం చేసుకుంటున్నారు.

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా పార్టీని మరింత బలహీనంగా చేస్తోంది. తాగాజా కేశినేని నెత్తిన పెట్టిన కొత్త కిరీటం కూడా అంతే.