2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందే 23 సీట్లు. అందులో నలుగురు ఆల్రెడీ చంద్రబాబుని ఛీకొట్టి జగన్ వైపు వచ్చేశారు. వైసీపీ సరిగ్గా ఇన్విటేషన్ ఇవ్వలేదు కానీ.. లేకపోతే మిగతావారు కూడా టీడీపీలో మిగిలేవారు కాదు. అయితే ఆ నలుగురు వెళ్లిపోవడం కూడా చంద్రబాబుకి ఇష్టంలేదు. అందులో ఇద్దరు తన సామాజికవర్గం నేతలుండటంతో బాబు ఖంగుతిన్నారు. వారిద్దర్నీ నయానో భయానో తన దారికి తెచ్చుకోవాలని చూశారు.
అటు నుంచి పొగ..
చంద్రబాబు రాజకీయాలెప్పుడూ అలాగే ఉంటాయి. వైసీపీలోకి వెళ్లినా కరణం బలరాంని ఇబ్బంది పెట్టాలని చూశారు. స్థానికంగా వైసీపీలో ఉన్న ఆమంచి వర్గాన్ని రెచ్చగొట్టాలని చూశారు. కొంతకాలం వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరిగింది కానీ ఇప్పుడు సర్దుబాటు అయినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య అసలు గొడవకు కారణం మాత్రం చంద్రబాబే.
ఇక వల్లభనేని వంశీతో కూడా గన్నవరం వైసీపీ నేతలకు విభేదాలున్నాయి. ఇక్కడ కూడా టీడీపీ నుంచి ఓ బ్యాచ్ ని రంగంలోకి దింపి.. వంశీ వ్యతిరేకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. కానీ ఫలితం కనపడలేదు. లోకల్ గా సర్దుబాట్లు జరిగాయని తెలుస్తోంది. కానీ విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విషయంలో మాత్రం చంద్రబాబు కొంత సక్సెస్ అయినట్టు అర్థమవుతోంది.
సర్దుబాటు చేసుకోలేకపోతున్న వాసుపల్లి..
మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ చేరికతో వైసీపీ స్థానిక నేతలు కూడా సంతోషపడ్డారు. ఆ సామాజిక వర్గంలో తమకు బలం పెరిగిందని భావించారు. కానీ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంలో వాసుతో కొంతమంది వైసీపీ నేతలకు విభేదాలు రావడంతో అవిప్పుడు రచ్చకెక్కాయి.
కొంతమంది కార్పొరేటర్లు సైతం వాసుపల్లి గణేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ కార్పొరేటర్లను వెనకుండి రెచ్చగొడుతోంది టీడీపీ వర్గమేననేది బహిరంగ రహస్యం. వాసుపల్లికి చెందిన విద్యాసంస్థలపై కొంతమంది కార్పొరేటర్లు నేరుగా విమర్శలు చేస్తున్నారు. కొవిడ్ సమయంలో ఫీజు తగ్గించలేదంటున్నారు. దీనిపై విజయసాయిరెడ్డికి కూడా వారు ఫిర్యాదు చేశారు.
మూడోసారి గెలుపు కష్టమేనా..?
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు వాసుపల్లి గణేష్. మూడో దఫా వైసీపీ టికెట్ పై ఆశ పెట్టుకున్నారాయన. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేవు. స్థానిక వైసీపీ నేతలే ఆయనకు పొగపెడుతున్నారు. మరోవైపు పార్టీ మారడంతో.. గతంలో ఇచ్చిన హామీల అమలుకి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసుపల్లిని పరోక్షంగా చంద్రబాబు ఇరకాటంలో పెట్టినట్టయింది.
మొత్తమ్మీద టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడంలో చంద్రబాబు తన కుతంత్రాలను బాగానే అమలులో పెట్టారని తెలుస్తోంది.