విజయనగరం జిల్లాలో పూసపాటి రాజులకు ఎంతో విలువ, గౌరవం ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం నుంచి సంస్థానాధీశులుగా వారు వ్యవహరిస్తున్నారు. ఆధునిక కాలంలో రాజ్యాలు పోయినా రాజకీయంగా కూడా పీవీజీ రాజు నుంచి ఆనందగజపతి రాజు, అశోక్ గజపతిరాజు దాకా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
పూసపాటి రాజులు అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజలు అంతా గౌరవిస్తారు. ఇక రాజకీయాలు అంటే అంకెల వ్యవహారం. అలాగే ఎన్నో ఈక్వేషన్స్ పనిచేస్తాయి. అలా ఎన్నికల్లో ఓడినా కూడా పూసపాటి రాజులు అంటే జనాలలో ఒక విధమైన గౌరవాభిమానాలు ఎపుడూ ఉన్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే రామతీర్ధం లో శంకుస్థాపన వేళ కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి వారి వారసుడు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఒకింత ఆవేశానికి లోను అయ్యారనే అంటున్నారు. ఆయన పెద్ద మనిషి, ఆయన హోదా రిత్యా, వయసు రిత్యా, వంశం రిత్యా కూడా అశోక్ చాలా పెద్ద మనిషిగానే అంతా ఒప్పుకుంటారు.
ఆయన సైతం ఎపుడూ తన బ్యాలన్స్ కి కోల్పోలేదు. కానీ రామతీర్ధంలో మాత్రం ఎందుకో అశోక్ ఆవేశానికి గురి అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ శిలాఫలకాన్ని తొలగించాలని చూడడం నిజంగా విస్మయపరచే విధంగానే అందరూ భావించారు. అశోక్ అలా చేస్తారని అనుకోలేదని మంత్రి బొత్స సత్యనారాయాణ, మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా వ్యాఖ్యానించారు.
ఇక ప్రోటోకాల్ విషయంలో తాము అన్ని నిబంధలను పాటించామని మంత్రులు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే అశోక్ ప్రభుత్వ శంకుస్థాపనను అడ్డుకున్నారు అన్న కారణం మీద ఆలయ ఈవో ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన మీద 473,353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజకీయ నాయకుల మీద కేసులు మామూలే అనుకున్నా అశోక్ ఆవేశపడడం మీద మాత్రం చర్చ అయితే సాగుతోంది. నాకు అసహనం లేదు అని పెద్దాయన అంటున్నా ఆయన ఎందుకో దూకుడుగానే వెళ్లారన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే అశోక్ ఆవేశానికి ఫలితం పోలీసు కేసులని అంటున్నారు. చూడాలి ఇది మరెంత ముందుకు వెళ్తుందో.