కరోనా కేసుల సంఖ్య ఇండియాలో పతాక స్థాయికి చేరుతోంది. ఏ రోజుకారోజు కేసుల సంఖ్య భారీ స్థాయికి చేరుతూ ఉంది. ప్రపంచం కనీవినీ ఎరగని స్థాయిలో కేసుల సంఖ్య ఇండియాలో నమోదవుతూ ఉంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షల స్థాయిని దాటేసింది.
కొన్ని అంచనాల ప్రకారం.. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య ఐదు లక్షల వరకూ చేరనుందట. దాదాపు నెల కిందటే కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని చెప్పాయి. రోజువారీ కేసుల సంఖ్య ఐదు లక్షల వరకూ చేరుతుందని అప్పట్లోనే కొన్ని అధ్యయన సంస్థలు చెప్పాయి. ఆ అంచనాలు నిజం అయ్యేలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు.
అధికారిక లెక్కల ప్రకారమే రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షలను మించాయంటే, అనధికారికంగా- టెస్టుల వైపు వెళ్లని వారి కలిపితే ఈ కేసుల సంఖ్య ఎక్కడకు చేరుతుందో మరి! ఇంతకీ ఇండియాలో ఈ వేవ్ తగ్గుదల ఎప్పుడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రోజువారీ కేసుల సంఖ్య ఐదు లక్షలకు చేరుతుంది అనే అంచనాలు వేసిన పరిశోధకులే.. మే నెలాఖరుకు ఇండియాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని కూడా చెప్పారు. ఎందుకు తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు కానీ, మే నెలాఖరుకు తగ్గుముఖం పడుతుందని మాత్రం ఆ అధ్యయనకర్తలు చెప్పారు.
తాజాగా మరో వైరాలాజిస్ట్ కమ్ వ్యాక్సినోలజిస్ట్ ఒక ఊరటను ఇచ్చే అంశం చెబుతున్నారు. ఆమె పేరు గగన్ దీప్. వేలూర్ మెడికల్ కాలేజ్ లో ఒక విభాగాధిపతి, ప్రొఫెసర్. ఈమె పిల్లల్లో సోకే రొటా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త కూడా.
బ్రిటన్ లోని రాయల్ సొసైటీ ఫెలోషిప్ ను పొందిన తొలి భారతీయ మహిళ. రొటా వైరస్ కు ఈమె కనిపెట్టిన వ్యాక్సిన్ వల్ల ప్రతియేటా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు నిలబడుతున్నాయి. ఇంత నేపథ్యం ఉన్న.. గగన్ దీప్ కరోనా వైరస్ వ్యాప్తి గురించి కూడా తన అంచనాలను వ్యక్తం చేశారు.
తమ పరిశీలనలను బట్టి మే నెల మధ్య నుంచినే ఇండియాలో ఈ వేవ్ కరోనా తగ్గుముఖం పట్టవచ్చని ఆమె చెబుతున్నారు. సాధారణంగా ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే శాస్త్రీయత ఏమిటనే ప్రశ్న వ్యక్తం అవుతుంది.
ఒక వైరాలజిస్ట్, వ్యాక్సినోలజిస్ట్ ఈ మాట చెబుతూ ఉండటంతో ఎక్కడో చిన్న ఆశ కలగక మానదు. ఈ అంచనాల నిజం అయ్యి.. వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టాలని ఆశిద్దాం.