ఇప్పుడెందుకు అంత తొంద‌ర‌?

మేడ్చ‌ల్ జిల్లా శామీర్‌పేట మండ‌ల ప‌రిధిలోని  దేవ‌ర‌యాంజ‌ల్ భూక‌బ్జా వ్య‌వ‌హారంపై విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ భూముల‌కు సంబం ధించి ఎప్ప‌టి నుంచో వివాదం ఉంద‌ని, ఇప్పుడు అంత తొంద‌రెందుక‌ని ప్ర‌భుత్వాన్ని…

మేడ్చ‌ల్ జిల్లా శామీర్‌పేట మండ‌ల ప‌రిధిలోని  దేవ‌ర‌యాంజ‌ల్ భూక‌బ్జా వ్య‌వ‌హారంపై విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆ భూముల‌కు సంబం ధించి ఎప్ప‌టి నుంచో వివాదం ఉంద‌ని, ఇప్పుడు అంత తొంద‌రెందుక‌ని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు నిల‌దీసింది. అంతేకాదు, ప్ర‌జ‌లు క‌రోనాతో చ‌స్తుంటే లేని స్పంద‌న ఈ అంశంపై మాత్రం ఎందుక‌ని గ‌ట్టిగా ప్ర‌శ్నించింది.

దేవ‌ర‌యాంజ‌ల్ భూముల‌కు సంబంధించి అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు కేసీఆర్ స‌ర్కార్ రాత్రికే రాత్రి న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌తో కూడిన విచార‌ణ క‌మిటీని వేసింది. ఈ నెల 3న ప్రభుత్వం జారీ చేసిన జీవో 1014ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. ఆ భూముల‌కు సంబంధించి య‌జ‌మానులు విచార‌ణ నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు సీరియ‌స్‌గా స్పందించింది.

ఈ క‌రోనా విప‌త్కాలంలో మ‌న ప‌క్క‌నున్న ఓ వ్యక్తి చనిపోతే శ్మశానానికి తీసుకెళ్లేందుకు చాలా సమయం పట్టిందని గుర్తు చేసింది. ఇలాంటి క‌ష్ట‌కాలంలో నలుగురు అధికారులతో కమిటీని వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగిలిన ఆలయాల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
 
అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ప్ర‌సాద్ స్పందిస్తూ కేవలం ప్రాథమిక విచారణ కోసమే కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎవరినీ ఖాళీ చేయించటం, ఆక్రమించటం లేదని ఏజీ పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఇచ్చాకే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్ప‌టికిప్పుడే ఆక్ర‌మ‌ణ‌ల‌ కూల్చివేతలు చేప‌ట్ట‌మ‌ని కోర్టుకు తెలిపారు.

దీనిపై హైకోర్టు జోక్యం చేసుకుంటూ ప్రాథమిక విచారణకైనా నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆరోప ణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కమిటీ విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. 

పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని దేవదాయశాఖను హైకోర్టు ఆదేశించింది.