దేశ ప్రజల చర్చ, చూపు ఇప్పుడు కేవలం కరోనా వ్యాక్సిన్ మీదే ఉంది. కరోనా సెకెండ్ వేవ్ లో భయానక పరిస్థితులను సృష్టించిన నేపథ్యంలో, మూడో వేవ్ రావొచ్చని, దాన్ని ఎదుర్కొనాలంటే వ్యాక్సినే పరిష్కార మార్గమని నిపుణులు తేల్చి చెబుతూ ఉండటంతో.. ప్రజలకు వ్యాక్సిన్ మీద మరింతగా దృష్టి మళ్లింది.
మూడు నెలల కిందట వరకూ వ్యాక్సిన్ గురించి ఎవరో బాగా చదువుకున్న వాళ్లు, వైద్యుల సలహాలు పొందిన వాళ్లు.. మాత్రమే ఆలోచించారు. ఇప్పుడు గ్రామీణులు, అక్కడి నిరక్షరాస్య ప్రజలు కూడా వ్యాక్సిన్ మీద అవగాహనతో ఉన్నారు. అప్పుడు వ్యాక్సిన్ అంటే భయపడే పరిస్థితి.
ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తే చాలనే పరిస్థితి. కరోనా భయంతో వ్యాక్సిన్ మీద గ్రామీణులు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే.. వారి అవసరాలకు తగ్గట్టుగా మాత్రం ఇప్పటి వరకూ వ్యాక్సిన్ ఉత్పాదన జరగడం లేదని స్పష్టం అవుతూనే ఉంది.
వ్యాక్సినేషన్ ఉత్పాదన మొదలై నెలలు గడిచిపోతున్నా… ఇప్పటి వరకూ రోజుకు 20 లక్షలకు మించిన స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు కోటి పైగా డోసుల వ్యాక్సినేషన్ జరగాల్సిన ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులో ఐదో వంతు స్థాయిలో మాత్రమే వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇలా అయితే టార్గెట్ ఎప్పటికి రీచ్ కావాలనేది కీలకమైన ప్రశ్న.
అయితే ఆగస్టు ఒకటి నాటికి రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ అందించే పరిస్థితి వస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే అది కేవలం నోటి మాట మాత్రమేనా? అనేది చర్చనీయాంశం అవుతోంది. రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ అందించడానికి ఇంకా రెండు నెలల సమయం ఉందంటున్నారు. మరి అప్పటికైనా వీరు నిజంగానే ఆ టార్గెట్ ను రీచ్ కాగలరా? అనే సందేహాలు ఉండనే ఉన్నాయి.
మరిన్ని వ్యాక్సిన్లకు పర్మిషన్లను ఇస్తుందట కేంద్ర ప్రభుత్వం. విదేశీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. కోవ్యాగ్జిన్ సాంకేతిక వివరాలను ఇతర కంపెనీలతో షేర్ చేస్తారట, ఇలా ఉత్పత్తిని పెంచుతారట. అయితే విదేశీ వ్యాక్సిన్లు వందల కోట్ల డోసుల స్థాయిలో అందుబాటులోకి రావనే క్లారిటీ వస్తోంది. కొన్ని వ్యాక్సిన్లు ఈ ఏడాదిలో అసలు అందుబాటులోకే రావట ఇండియాలో.
ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఐదు కోట్ల డోసులట. ఇక రష్యన్ వ్యాక్సిన్లు రానున్నాయి. వాటిని దేశంలోనే ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే కసరత్తు సాగుతోంది. ఆగస్టు నాటికి రష్యన్ వ్యాక్సిన్లు కొంత వరకూ అందుబాటులోకి రావొచ్చు. కోవ్యాగ్జిన్, కోవీ షీల్డ్ లు ఇప్పుడు నెలకు ఎనిమిది కోట్ల స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయట. ఈ స్థాయిని ఇంకా చాలా పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఈ పరిస్థితిల్లో ఆశాకిరణంగా మరో స్వదేశీ వ్యాక్సిన్ పేరు వినిపిస్తూ ఉంది. ఇది కూడా రానున్న రెండు మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందంటున్నారు. అది కూడా ఈ ఏడాది చివరకు ఈ వ్యాక్సిన్ 30 కోట్ల డోసుల పరిమాణంతో అందుబాటులోకి వస్తుందనే వార్తలు ఊరట.
మొత్తానికి మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు విషమ పరీక్షే ముందుంది. అదేంటో క్లియర్ గా కనిపిస్తోంది. ఆరు నెలల సమయం, 200 కోట్ల డోసులు.. ఈ టెస్టులో మోడీ ప్రభుత్వం విజయవంతం కాలేకపోతే మాత్రం.. ప్రజల నుంచి మరింత తీవ్ర అసహనాన్ని ఎదుర్కొనాల్సి ఉండవచ్చు.