మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అంటే పెద్ద మనిషిగా అందరికీ గౌరవం. మొదటి నుంచి ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ వచ్చారు. అందువల్లే పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ వచ్చారు. కానీ ఆయన రాజధాని విషయానికి వచ్చేసరికి పెద్దరికాన్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తోంది. కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై ఆయన ఆలోచిస్తున్నారు. సామాజిక బలహీనతలను అధిగమించలేకపోతున్నారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
‘విశాఖ పరిసర ప్రాంతాల్లోని వైసీపీ నాయకుల భూముల రేట్లను పెంచుకునేందుకే అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలిస్తున్నారు. రాజధాని ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదన్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజ్యాంగంపై సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్న జీవీఎల్ రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పాలి’ అని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
అమరావతిని రాజధానిగా ఏ పరిస్థితుల్లో, ఏ విధంగా ఎంపిక చేశారో వడ్డె శోభనాద్రీశ్వరరావుకు బాగా తెలుసు. ఐవైఆర్ కృష్ణారావు రచన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకం అంకితాన్ని అందుకున్న పెద్ద మనిషి వడ్డె. అలాగే ఈ పుస్తకానికి ఆయన ముందు మాట రాశారు. అమరావతిని చంద్రబాబు సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇంకా అనేక విషయాలపై వడ్డె సీరియస్ కామెంట్స్ చేశారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
‘మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయే సమయంలోనే రాయలసీమ ప్రజలు వ్యక్తం చేసిన భయాల నేపథ్యంలోనూ , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్న సమయంలోనూ రాయలసీమకు చెందిన కొందరు రాయల తెలంగాణను సూచించిన నేపథ్యంలోనూ దొనకొండను రాజధానిగా సూచించడం జరిగింది. రాయలసీమ ప్రజల ప్రాంతీయ మనోభావాలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు దొనకొండ రాజధానిగా ఉండడం వల్ల ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల వెనుకబడిన ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి’
‘నవ్యాంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని స్థలం ఎంపికలో తగిన స్థలాన్ని సూచించడానికి శివరామకృష్ణన్ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికకు ఇవ్వవలసిన ప్రాధాన్యాన్ని ఇవ్వకపోవడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరపాటు’
‘విజయవాడ పరిసరాల్లో సంపద్వంతమైన వ్యవసాయ భూముల్లో అనేక పంటలు పండించే ప్రదేశంలో ఒక పెద్ద హరిత క్షేత్ర రాజధాని నగరాన్ని ఈ కమిటీ సిఫార్సు చేయలేదు. పురపాలకశాఖ మంత్రి కె.నారాయణ నేతృత్వంలో కొంత మంది ప్రజాప్రతినిధులు, కొంత మంది పారిశ్రామికవేత్తలతో మరో కమిటీని నియమించడం సముచితంగా లేదు. ఈ కమిటీ ఎలాంటి నివేదికను సమర్పించకపోవడం మరీ ఆశ్చర్యకరం. ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రదేశంలో నదీ తీరాన రాజధాని నిర్మించాలని ముందుగానే తీసుకున్న నిర్ణయానికి కొంత విశ్వసనీయత కల్పించడానికి ఒక యుక్తి మాత్రమే ఇది’
‘ఎక్కువ ధరలు వస్తాయనో లేకపోతే రాజకీయ సామాజిక కారణాల వల్లో చాలా మంది రైతులు దాదాపు 32 వేల ఎకరాలను లాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఈ భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం అత్యంత దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం రాజధాని నగరంలో వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుపోషణ, కోళ్ల పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, తదితర కార్యకలాపాలకు అవకాశమే లేదు. అది పూర్తిగా అర్బన్ కాంక్రీట్ జంగిల్’
ఇన్నేసి మాటలు మాట్లాడిన వడ్డె శోభనాద్రీశ్వరరావు…ఇప్పుడు అక్కడే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? అంతేకాకుండా రైతులకు జీవీఎల్ క్షమాపణలు చెప్పాలని చెబుతున్న వడ్డె…ఐవైఆర్ కృష్ణారావు పుస్తకానికి రాసిన ముందు మాట, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలను పోల్చుకుంటే ‘వడ్డె’ పెద్దరికానికి ‘శోభ’నిచ్చేలా లేవని మాత్రం ఎవరైనా చెబుతారు.