అవకాశం దొరికితే విరుచుకుపడిపోవడానికి టీడీపి సిద్ధంగా ఉంది. అలాంటి నేతలకు ఇప్పుడు అనుకోని వరంగా కియా దొరికింది. కియా మోటార్స్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలిస్తున్నారంటూ ప్రసిద్ధ వార్తాసంస్థ రాయిటర్స్ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో టీడీపీ నేతలు పండగ చేసుకున్నారు. కానీ వాళ్లకు ఎక్కువ టైమ్ ఇవ్వలేదు జగన్. సదరు వార్తలో నిజం లేదని స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని కియా కూడా అంగీకరించింది. ఇక రాయిటర్స్ నుంచి వివరణ రావడమే ఆలస్యం.
ఆంధ్రప్రదేశ్ లో కియా ప్లాంట్ ఈమధ్యే ఉత్పత్తి ప్రారంభించింది. ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్ కు ఉంది. దాదాపు 7300 కోట్ల రూపాయల ఖరీదైన ఈ ప్లాంట్ ను తమిళనాడుకు తరలించేందుకు కియా ప్రయత్నిస్తోందనేది రాయిటర్స్ కథనం. ఇదే కనుక జరిగితే ప్రస్తుతం ఆ ప్లాంట్ లో ఉద్యోగాలు చేస్తున్న 11వేల మంది స్థానికులు ఉపాధి కోల్పోతారు. ఇంతకీ రాయిటర్స్ చెబుతున్న లాజిక్ ఏంటంటే.. కొత్తగా ఏర్పాటైన ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలో చేసిన మార్పులు కియాకు నచ్చలేదట. అందుకే తరలిపోవడానికి ఆలోచిస్తోందట.
ఈ వార్త వచ్చిన వెంటనే వైసీపీ సర్కార్ ఎలర్ట్ అయింది. రాయిటర్స్ కథనంలో ఎలాంటి నిజం లేదని వాణిజ్యం-పరిశ్రమలు-పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ప్రభుత్వం తరఫున ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం, కియా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని స్పష్టంచేశారు. ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అటు ఇదే విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రస్తావించారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు.
మరోవైపు స్వయంగా కియా ఈ వార్తపై స్పందించింది. గతంలో కూడా ఇలానే మహారాష్ట్రకు తరలిపోతున్నట్టు కథనాలు వచ్చాయని, ఇప్పుడు తమిళనాడు పేరు కొత్తగా చేర్చారని, ప్లాంట్ తరలింపుపై తమకు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టంచేసింది. తమ ప్లాంట్ లో 85శాతం స్థానిక యువత పనిచేస్తోందని, ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని తెలిపిన కియా.. ఏపీ సర్కార్ తో కలిసి క్లోజ్ గా పనిచేస్తున్నామని స్పష్టంచేసింది.
ఇలా ఇటు కియా, అటు ఏపీ సర్కార్ ఒకేసారి రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ పప్పులుడకలేదు. ఈ అంశాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో దేవినేని ఉమ లాంటి వ్యక్తులు ఆల్రెడీ రంగంలోకి దిగిపోయారు. ఇప్పుడు అలాంటి వాళ్లంతా సైలెంట్ అవుతున్నారు. మరోవైపు ఈ వార్తాకథనం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ.. రాయిటర్స్ కు ఘాటుగా లేఖ రాయడానికి సిద్ధమౌతోంది ఏపీ సర్కార్.