విజయ్‌పై ఐటీ నజర్‌: ఫేక్‌ కలెక్షన్లా.? రాజకీయమా.?

ఒకదాని తర్వాత ఇంకోటి.. వరుస వివాదాలతో తమిళ హీరో విజయ్‌ సినిమాలు సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్నాయి. ఆ వివాదాల్లో ఫేక్‌ కలెక్షన్ల వ్యవహారాలూ వున్నాయి. అవన్నీ ఇప్పుడు విజయ్‌ మెడకి గట్టిగానే చుట్టుకున్నట్లున్నాయి. ఐటీ…

ఒకదాని తర్వాత ఇంకోటి.. వరుస వివాదాలతో తమిళ హీరో విజయ్‌ సినిమాలు సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్నాయి. ఆ వివాదాల్లో ఫేక్‌ కలెక్షన్ల వ్యవహారాలూ వున్నాయి. అవన్నీ ఇప్పుడు విజయ్‌ మెడకి గట్టిగానే చుట్టుకున్నట్లున్నాయి. ఐటీ ఈ తమిళ హీరోని కార్నర్‌ చేసింది. నిన్న షూటింగ్‌ స్పాట్‌లోనూ, ఆ తర్వాత ఇంట్లోనూ విజయ్‌ని విచారించారు ఐటీ అధికారులు. ఇంకా ఐటీ సోదాలు, తనిఖీలు, విచారణలు కొనసాగుతూనే వున్నాయి.

విజయ్‌తో ఇటీవలి కాలంలో సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థలపైనా ఐటీ సోదాలు జరుగుతుండడం గమనార్హం. నిజానికి సినీ పరిశ్రమలో ఐటీ సోదాలనేవి సర్వ సాధారణమైన విషయాలే. సోదాలు జరగడం, ఆ తర్వాత ఆ వ్యవహారంపై మీడియాలో నానా యాగీ చోటు చేసుకోవడం షరా మామూలే. ఇటీవలే రష్మిక ఇంటిపైనా ఐటీ సోదాలు జరిగాయి. ఆ మధ్య తెలుగులో పలువురు సినీ ప్రముఖులతోపాటు, బుల్లితెర సెలబ్రిటీలపైనా ఐటీ సోదాలు జరిగిన విషయం విదితమే.

అయితే, విజయ్‌ వ్యవహారం వేరు. గత కొంతకాలంగా విజయ్‌ మీద పొలిటికల్‌ రచ్చ నడుస్తోంది. బీజేపీ, విజయ్‌ని కార్నర్‌ చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా విజయ్‌ నుంచి డైలాగులొస్తున్నాయి.. రీల్‌ అండ్‌ రియల్‌ లైఫ్‌లో విన్పిస్తున్న ఈ డైలాగులు బీజేపీ పెద్దల్ని గట్టిగానే కలవరపెట్టినట్లు తాజా ఐటీ సోదాల్ని బట్టి అర్థమవుతోందనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

‘విజయ్‌ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడు..’ అంటూ విజయ్‌ అభిమానులు నినదిస్తోన్న విషయం విదితమే. ఆ మాటకొస్తే తమిళనాడులో చాలా మంది హీరోల చుట్టూ ఈ రాజకీయ పుకార్లు విన్పిస్తున్నాయి. అజిత్‌కి రాజకీయాలతో పరిచయం వున్నా, ఆయన ఇంతవరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. రజనీకాంత్‌, ‘ఇదిగో.. అదిగో..’ అంటూనే వున్నాడు ఎన్నో ఏళ్ళుగా. కమల్‌ హాసన్‌ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేశాడనుకోండి.. అది వేరే విషయం.

మొత్తమ్మీద, విజయ్‌ వ్యవహారం ఇప్పుడు తమిళనాడులో హాట్‌ టాపిక్‌ అయ్యింది. విజయ్‌ – అజిత్‌ అభిమానుల మధ్య ఫేక్‌ కలెక్షన్స్‌ వార్‌ ఇలా విజయ్‌ కొంప ముంచేసిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంటే.. తమ అభిమాన హీరో మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారంటూ విజయ్‌ అభిమానులు గుస్సా అవుతున్నారు. ‘మేమంతా విజయ్‌ వెంట వున్నాం..’ అంటూ సోషల్‌ మీడియాలో విజయ్‌ అభిమానులు హంగామా చేస్తూ పలు హ్యాష్‌ ట్యాగ్‌లను ట్రెండింగ్‌లోకి తీసుకురావడం గమనార్హం.

ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా