ఎన్ని జన్మలెత్తినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వామి’కి ఆర్‌కే లాంటి గొప్ప భక్తుడు దొరకడు. దేవుళ్లకు పుష్పాభిషేకానికైనా విరామం ఇస్తారామో గానీ, చంద్రబాబుస్వామికి మాత్రం పరమ భక్తుడైన ఆర్‌కే అక్షరాభిషేకం చేయడం ఎట్టి పరిస్థితులో మానడు. కాకపోతే తన చంద్రస్వామి కంటే గొప్పస్వాములు విశాఖలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి లాంటి వారున్నారని భక్తుడికి కోపం వస్తోంటోంది. అందుకే అప్పుడప్పుడు తన భక్తి పత్రికలో విశాఖ స్వామిపై అక్కసు వెళ్లగక్కుతుంటాడు.
‘తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీంలేక డేంజర్‌గా మారుతోంది’ అని ఉర్దూ కవితకు గజ్జల మల్లారెడ్డి స్వేచ్ఛానువాదం చేశారు. తెలుగు నాట మీడియాలో కులాల వారీగా విడిపోయి యజమానులు ‘స్వామి’ భక్తిని ప్రదర్శిస్తున్నారు. తమ నాయకుడి వ్యతిరేకులంతా తమకు శత్రువలనే భావిస్తూ ఎడాపెడా వార్తా కథనాలను వండి వారుస్తుంటారు. తమ స్వామికి అనుకూల వార్తలతో పాటు ప్రత్యర్థులపై వ్యతిరేక కథనాలను కుమ్మరిస్తూ ప్రసాదం కింద ప్రజలకు పంచుతుంటారు.
దొరకునా ఇటువంటి సేవ! అనే శీర్షకతో రాసిన కథనం ఆలోచింపదగిందే. ఆ కథనం విషయాన్ని పక్కన పెడితే ప్రతిరోజూ చంద్రబాబుస్వామికి సదరు పత్రికాధిపతి చేస్తున్నది సేవ కాక మరేంటి? ప‌్రతిరోజూ ‘అక్షర’ నీరాజనం పలకడం లేదా? వ‌్యక్తి పూజ ఎవరు చేసినా తప్పే. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆకాశం నుంచి దిగిరాలేదు. ప్రజలు ఎన్నుకుంటేనే ఏ పదవైనా లభిస్తుంది. ప్రతి ఆదివారం ఆర్‌కే రాసే ‘కొత్తపలుకు’ చంద్రస్వామికి సుప్రభాత సేవగా అర్థం చేసుకోవాలి.
ఒక పత్రికాధిపతిగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఆర్‌కే….గత ఐదేళ్లలో చేసింది ఏంటి? ఒక్కరోజు కూడా విడిచి పెట్టకుండా చంద్రబాబు ‘స్వామి’ సేవలో తరించలేదా? అంతేనా చిన్నస్వామి లోకేశ్ సేవలో కూడా తమరు భక్తిపారవశ్యంలో మునిగి తేలలేదా? అప్పుడు గుర్తు రాలేదా ‘దొరుకునా ఇటువంటి సేవ’ అనే విషయం. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సేవలో తరించే వారిని విమర్శించే హక్కు, అర్హత సామాన్య ప్రజలకు ఉంటుందే తప్ప…ఇప్పటికీ చంద్రబాబు స్వామి పూజలో పరవశించే తమకు కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అందుకే మీ మాటకు, రాతకు విలువ ఉండటం లేదు.