సూపర్ స్టార్ విశ్వాస ఘాతకుడు ఎవరు?

మాట మార్చడం, రెండు నాల్కల ధోరణి.. అవసరం ఉన్నంత వరకే స్నేహం, అవసరాలకి ఆడవాళ్లని వాడుకునే తత్వం.. ఇలాంటి వాటన్నిటికీ పేటెంట్ చంద్రబాబుదేనంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చంద్రబాబు టికెట్ ఇస్తే టీడీపీలో గెలిచిన…

మాట మార్చడం, రెండు నాల్కల ధోరణి.. అవసరం ఉన్నంత వరకే స్నేహం, అవసరాలకి ఆడవాళ్లని వాడుకునే తత్వం.. ఇలాంటి వాటన్నిటికీ పేటెంట్ చంద్రబాబుదేనంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చంద్రబాబు టికెట్ ఇస్తే టీడీపీలో గెలిచిన వంశీ ఇప్పుడు జగన్ కి వంత పాడుతున్నారని ఇటీవల కొంతమంది టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు, వంశీని విశ్వాస ఘాతకుడంటూ సంబోధించారు. దీంతో ఆయన తిరిగి అదే స్థాయిలో రివర్స్ అటాక్ మొదలుపెట్టారు.

తాను విశ్వాసఘాతకుడ్ని అయితే బాబు డబుల్, ట్రిపుల్ విశ్వాస ఘాతకుడంటూ మండిపడ్డారు వంశీ. ఒకవేళ తాను విశ్వాస ఘాతకుడ్ని అయితే అది కేవలం చంద్రబాబుకేనని.. కానీ బాబు తనకి కాంగ్రెస్ లో అవకాశమిచ్చిన ఇందిరాగాంధీకి, ఆ తర్వాత పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకున్న ఎన్టీఆర్ కి, ఇటీవల స్నేహం చేసి వదిలేసిన ప్రధాని నరేంద్రమోదీకి.. అందరికీ విశ్వాస ఘాతకుడేనన్నారు. 

తనని విమర్శిస్తే కచ్చితంగా అది ముందు బాబుకే తగులుతుందని ఆ విషయం టీడీపీ నేతలు గమనించాలని చెప్పారు.

ఆడవారితో పనులు చేయించుకుని వారిపై సింపతీయా..?

ఆడవారిని వాడుకుని జయప్రదంగా పనులు పూర్తి చేసుకునే చంద్రబాబు.. ఆడవారిపై సింపతీ చూపించడం హాస్యాస్పదం అన్నారు వంశీ. చంద్రబాబు ఇంట్లోనే ఆడవాళ్లుంటారా, ఇతరుల ఇళ్లలో ఉన్న ఆడవారికి మర్యాద ఉండదా అని ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రిని బూతుమాటలు తిట్టించి, వాటిని ఖండించకపోగా.. పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడిని హైలెట్ చేస్తూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో కాల్ మనీ – సెక్స్ రాకెట్ కుంభకోణం జరిగిందని దాని సంగతేంటని ప్రస్నించారు. వనజాక్షి అనే ఎమ్మార్వోపై దాడి జరిగితే.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా వదిలేశారని.. అలాంటి టీడీపీ నేతలకు ఆడవారి గురించి, వారి మాన మర్యాదల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు వంశీ.

దుర్గమ్మ గుడిలో అపచారం..

కృష్ణాజిల్లా మహిళల గురించి తాను మాట్లాడానని, దుర్గమ్మ ఆగ్రహానికి గురవుతానంటూ కొంతమంది టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, అలాంటి వారంతా దుర్గ గుడిలో జరిగిన క్షుద్రపూజల గురించి నోరు విప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో ఆయన కొడుకు లోకేష్ కోసం దుర్గ గుడిలో క్షుద్రపూజలు జరిగాయని చెప్పారు. దుర్గమ్మ చెంతన ఫ్లైఓవర్ నిర్మాణం కూడా సరికాదన్నారు. అలాంటి పనులు చేసిన చంద్రబాబుని ఆ దుర్గమ్మే శిక్షించిందని అన్నారు వంశీ.

టీడీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత, వైసీపీ స్టాండ్ తీసుకున్నా.. వంశీ దాదాపుగా సైలెంట్ గానే ఉంటున్నారు. స్థానికంగా వైసీపీ నేతలతో సఖ్యత లేకపోవడంతో పెద్దగా పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడంలేదు. అయితే జనాగ్రహ దీక్షలతో మరోసారి వంశీ తెరపైకి వచ్చారు. చంద్రబాబుని, లోకేష్ ని చెడామడా తిట్టారు. దీంతో అటు టీడీపీ నేతలు కూడా వంశీకి కౌంటర్ ఇచ్చారు. 

టీడీపీ గుర్తుపై గెలిచి, చంద్రబాబుకి విశ్వాస ఘాతకుడిగా మారారని అన్నారు. దీనికి వంశీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఖాళీ లెటర్ హెడ్ పై సంతకం చేసి మీడియాకిచ్చారు. తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీకి దిగుతానని, దమ్ముంటే టీడీపీ లీడర్ ఎవరైనా వచ్చి తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు.