ప్రస్తుతం దేశం మొత్తం ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై దృష్టిపెట్టాయి. దీని చుట్టూ దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతోందని ఓ అంచనా. ఓవైపు ఇలా క్రికెట్ ఫీవర్ నడుస్తుంటే, మరోవైపు ఈ ఫీవర్ ను క్యాష్ చేసుకునేందుకు చాలా రంగాలు ఉత్సాహపడుతున్నాయి.
ఇప్పటికే ఎలక్ట్రానిక్ విభాగంలో ఇండోపాక్ క్రికెట్ పేరిట చాలా ఆఫర్లు కనిపిస్తున్నాయి. అటు ఆన్ లైన్ సైట్స్ లో ఆఫర్లకు లెక్కేలేదు. ఇదిలా ఉండగా, ఓ ఫుడ్ యాప్ సంస్థ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.
కరీమ్ పాకిస్థాన్ అనే ఫుడ్ యాప్, తమ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొరాకో నుంచి ఇస్లామాబాద్ వరకు దాదాపు 100 నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న ఈ యాప్.. ఇవాళ్టి మ్యాచ్ లో పాక్ గెలిస్తే.. ఈరోజు ఫుడ్ ఆర్డర్ చేసిన వినియోగదారులందరికీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.
ఈరోజు రాత్రి 9 గంటల వరకు తమ యాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసినవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒకేవేళ పాకిస్థాన్ గెలిస్తే.. రాత్రి 9 గంటల వరకు ఎంతమంది ఫుడ్ ఆర్డర్ చేశారో, వాళ్లందరి ఖాతాల్లోకి ఆర్డర్ చేసిన మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయబోతోంది ఈ సంస్థ.
ఇక భారతీయ నగరాల విషయానికొస్తే.. దాదాపు అన్ని పబ్స్, బార్లు, రెస్టారెంట్స్ క్రికెట్ ఆఫర్లు ప్రకటించాయి. నిర్ణీత రుసుము చెల్లించి కావాల్సినంత తాగేలా లేదా తినేలా రకరకాల ఆఫర్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో కనిపిస్తున్నాయి. మరోవైపు జోరుగా బెట్టింగులు కూడా సాగుతున్నాయి.