భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సోషల్ మీడియా నుంచి సమంత ఎదుర్కొన్న/ఎదుర్కొంటున్న వేధింపుల గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సమంత విడాకుల వ్యవహారంపై దిగజారి కథనాలు ప్రసారం చేశాయి. ఇలాంటి మీడియా సంస్థలపై సమంత కోర్టులో కేసు కూడా వేసింది. ఇప్పుడీ వ్యవహారం మొత్తంపై పరోక్షంగా స్పందించాడు మంచు విష్ణు.
థంబ్ నెయిల్స్ తో హీరోయిన్లను వేధిస్తే, ఇకపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా సదరు యూట్యూబ్ సంస్థలు లీగల్ గా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంచు విష్ణు హెచ్చరించాడు. హీరోయిన్లు తమ ఆడపడుచులని, అలాంటి వాళ్లపై అసభ్యకరంగా రాతలు రాస్తే చూస్తూ ఊరుకోమన్నాడు.
“హద్దు మీరి థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. లోపల మాత్రం ఏం ఉండదు. ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ యాజమాన్యాలతో చర్చలు మొదలుపెట్టాం. నేను అస్సలు ఊరుకోను. ఎక్కడికి పోతారు, వీళ్ల అడ్రెస్సులన్నీ దొరుకుతాయి. ఓ లీగల్ సెల్ పెట్టి, ఇలా ఎల్లో జర్నలిజం చేసే కొంతమంది వ్యక్తులపై కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. యూట్యూబ్ ఛానెల్స్ వ్యూయర్ షిప్ పెరగాలని ఇష్టమొచ్చినట్టు రాస్తే, అసోసియేషన్ చూస్తూ ఊరుకోదు.”
యూబ్యూట్ ఛానెల్స్ పై నియంత్రణ అనే అంశం మా అసోసియేషన్ ఎజెండాలో కూడా ఉందంటున్నాడు మంచు విష్ణు. ఇకనైనా యూట్యూబ్ ఛానెళ్లు సంయమనంతో వ్యవహరించాలని, తెగే వరకు వ్యవహారాన్ని తీసుకురావొద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేస్తున్నాడు.