టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన డిబేట్‌లో ఫోన్‌లో మాట్లాడిన వంశీ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
భువనేశ్వరిపై వంశీ నెల క్రితం నోరు పారేసుకోవడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. అయితే భార్యపై దూషణలకు పాల్పడిన వంశీని విడిచి పెట్టి… అసెంబ్లీలో సంబంధం లేని వ్యవహారంపై చంద్రబాబు రాద్ధాంతం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటిపర్యంతమై నాటకాన్ని రక్తి కట్టించారు.
వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలోనూ తన భార్యపై అవాంఛనీయ మాటలనే చంద్రబాబు ప్రస్తావించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఇవాళ్టి నుంచి ఊరూరూ వెళ్లి మహిళల గౌరవంపై చర్చ పెట్టాలని టీడీపీ నిర్ణయించడం ద్వారా… పరోక్షంగా తన భార్య విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు వ్యూహం పన్నారనే ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ చానల్‌లో వల్లభనేని వంశీ మాట్లాడుతూ… ఈ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఒక అడుగు వెనక్కి తగ్గారు. చంద్రబాబు సతీమణిపై తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. టీడీపీ సోషల్ మీడియాలో లోకేశ్ తన భార్య, చెల్లి, భార్యపై అభ్యంతరకర పోస్టులు పెట్టిస్తున్నాడని, అలాంటి వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో భువనేశ్వరిపై ఒక పదం తప్పుగా దొర్లిందని వంశీ ఒప్పుకున్నారు. భవిష్యత్‌లో తన నుంచి ఇలాంటివి పునరావృతం కావన్నారు.
భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నానన్నారు. టీడీపీలో అందరికంటే తనకు భువనేశ్వరి సన్నిహితమని చెప్పుకొచ్చారు. ఆమెను అక్కా అని పిలుస్తానన్నారు. ఎమోషన్‌లో భువనేశ్వరిపై మాట తూలినట్టు అంగీకరిస్తున్నానన్నారు. కమ్మ కులం నుంచి వెలేస్తామనే హెచ్చరికతో తాను క్షమాపణ చెప్పడం లేదన్నారు. కొడాలి నాని, తాను ఎవరికీ భయపడే ప్రశ్నే లేదన్నారు. తప్పు చేశానని భావించడం వల్లే ఆత్మసాక్షిగా క్షమాపణ చెబుతున్నట్టు వంశీ ప్రకటించారు.
భువనేశ్వరి విషయంలో తాను అలా మాట్లాడకూడకుండా ఉండాల్సిందని చెప్పారు. తాను ఒకటి మాట్లాడబోయి, మరొకటి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. టీడీపీలో ఉండగా నాలుగేళ్లు ఉత్తమ ఎమ్మెల్యేగా తనకు అవార్డు ఇచ్చినట్టు గుర్తు చేశారు. టీడీపీ నుంచి బయటికి వెళ్లగానే కులం నుంచి వెలి వేస్తామనడం, సంఘ విద్రోహశక్తులుగా ముద్ర వేయడం ఏంటని ప్రశ్నించారు.
తిట్టుకునే కల్చర్ చంద్రబాబు వల్లే ప్రారంభమైందన్నారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. చర్యకు ప్రతి చర్య వుంటుందని, అది చంద్రబాబు తెలుసు కోవాలని హితవు చెప్పారు. భువనేశ్వరిపై తన వ్యాఖ్యలను రాజకీయంగా స్వార్థం కోసం వాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని విరుచుకుపడ్డారు. వల్లభనేని వంశీ క్షమాపణతో ఇక భువనేశ్వరి కేంద్రంగా సాగుతున్న వికృత రాజకీయ క్రీడకు ముగింపు పలుకుతారని ఆశిద్దాం.