ఈనాటి రాజకీయాలు రమ్యంగా లేవు అంటూ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయాల మీద తనకు ఆసక్తి అనురక్తి లేనేలేదని అన్నారు. వాటి మీద తాను అసలు మాట్లాడను, ఇక మీదట ఆ రంగంలోకి రాను అంటూ స్పష్టంగా చెప్పేశారు.
ఇదంతా ఎక్కడ జరిగింది అంటే తాజాగా విశాఖలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాల మీద తన భావాలను చెప్పకుండానే చెప్పేశారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల తీరు పూర్తిగా మారాలని కూడా ఆయన గట్టిగా కోరుకున్నారు.
చట్టసభల్లో నాణ్యమైన చర్చలు అర్ధవంతంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాటి రాజకీయ నేతగా తాను ఈ పరిణామాల పట్ల ఆవేదన చెందుతున్నానని ఆయన చెప్పారు.
ఎక్కడైనా అభివృద్ధి ఉంటే శాంతి ఉంటుందని కూడా వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం విశేషం. ప్రజలు కూడా అభివృద్ధినే కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు మాత్రం మేధావులతో పాటు అన్ని వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.