తనను అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికలు వద్దని, ప్రాణాలు పణంగా పెట్టి తాము ఎన్నికల విధులు నిర్వహించలేమని తాను అన్నదాన్ని ప్రతిపక్ష పార్టీ నేతలు వక్రీకరించారని ఆరోపించారు.
ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం తమకు కల్పించిందని, తమ ప్రాణాలకు రాజ్యాంగం ఏం విలువ ఇచ్చిందని మాత్రమే తాను ప్రశ్నించానని ఆయన అన్నారు.
రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనడం ఎంత వరకు సబబు అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. తనను కొందరు టీడీపీ నేతలు వాడూవీడూ అని ఇష్టానుసారం తిడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే తనను విమర్శించే నేతలను తాను కూడా అరేయ్ ఒరేయ్ అనగలనని, ఆ విధంగా మాట్లాడి తన స్థాయి దిగజార్చుకోలేనని వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. అసలు ఏపీలో ఎన్నికల వాతావరణమే లేదని, ఆ విషయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కూడా తెలుసనన్నారు.
ఒకవేళ సుప్రీం కోర్టు ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా, నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితే కూడా లేదని వెంకట్రామిరెడ్డి తేల్చి చెప్పారు. తమ రాజకీయాలకు ఉద్యోగులను వాడుకోవద్దని ఆయన విన్నవించారు.
ఉద్యోగులను రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం టీడీపీనే చేసిందని ఆయన గుర్తు చేశారు. తనపై దాడికి టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఈ విషయంపై రేపు డీజీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు.