భా’జనసేన’ గా మారిపోవాల్సిందేనా?

అన్ని పొత్తులు ఒకలా వుండవు. కొన్ని పొత్తులు ఈడు-జోడు బాగా కుదిరి కనుల పండుగగా వుంటుంది కొన్ని పొత్తులు చూస్తే రాజు-పేద మాదిరిగా ఒకరు దర్పంతో మరొకరు చేతులు కట్టుకుని వున్నట్లుంటుంది. ఇక్కడ రాజు…

అన్ని పొత్తులు ఒకలా వుండవు. కొన్ని పొత్తులు ఈడు-జోడు బాగా కుదిరి కనుల పండుగగా వుంటుంది కొన్ని పొత్తులు చూస్తే రాజు-పేద మాదిరిగా ఒకరు దర్పంతో మరొకరు చేతులు కట్టుకుని వున్నట్లుంటుంది. ఇక్కడ రాజు భాజపా. ఎందుకంటే బలమైన జాతీయ పార్టీ. కేంద్రలో అధికారం. పేద జనసేన పార్టీ. పాపం, జిల్లాల కార్యవర్గాల మాట ఓటరెరుగు, రాష్ట్ర కమిటీనే సరైనది లేదు. పవన్, మనోహర్ అనే రెండు పేర్లు తప్ప సరైన పేరూ వినపడదు.

కానీ భాజపా, జనసేన అనే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. నిజానికి పొత్తులు రెండురకాలు.  చిరకాలంగా కొనసాగేవి. ఎన్నికల ముందు మాత్రమే కలిసేవి. కానీ భాజపా-జనసేన ల పొత్తు వేరే రకం. 2014లో మిత్రులుగా వున్నారు. కానీ పొత్తులాంటి పదాలు లేవు. అప్పుడు పోటీ కూడా లేదు. కానీ జనసేన  మోడీ వైపు తిరుగుతూనే బాబుగారి చేయి పట్టుకుంది. 2019 దగ్గరకు వచ్చేసరికి మోడీ వైపు నుంచి పక్కకు తిరిగి, బాబుగారి చేయి వదిలేసింది.

2020 నాటికి ఇక భాజపాతో పొత్తు అంటూ ఫిక్స్ అయ్యింది జనసేన. దాంతో మంచి నిర్ణయం. ఎన్నికల సమయం వరకు వేచివుండకుండా, ముందుగా కార్యాచరణ ప్రారంభించారు. 2024 నాటికి సిఎమ్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ తెరపై కనిపిస్తారు అని అంతా అనుకున్నారు. ఇక జనసేన సీరియస్ రాజకీయాలు సాగిస్తుందని అంతా భావించారు.

కానీ ఎక్కడయినా మనం, మన స్టయిల్ ఇదే అన్నట్లుగా సాగుతోంది జనసేన ప్రయాణం. పోనీ అదీ అభ్యంతరం కాదు. ఇక్కడ అనుమానం, అభ్యంతరం, అయోమయం అంతా భాజపా వ్యూహంతోనే. అసలు భాజపా వ్యూహమేమిటి? ఆ వ్యూహం ఫలితంగా జనసేన భవిత ఎలా వుంటుంది? పవన్ ను సిఎమ్ అభ్యర్థిగా ముందుగా ప్రకటించే అవకాశం వుంటుందా? అసలు ఆ అవకాశం వస్తుందా? ఇలా చాలా ప్రశ్నలు రేకెత్తిస్తోంది భాజపా వైఖరి.

ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్

భాజపాతో జనసేన పొత్తు ఎలా వుందీ అన్నది చెప్పడానికి పెద్దగా పరిశోధన చేయాల్సిన పనిలేదు. జనసేన అధిపతి ఢిల్లీ వెళ్లి, భాజపా పెద్దల దర్శనం కోసం పడిగాపులు పడిన వైన పరిశీలిస్తే చాలు, అర్థమైపోతుంది. ఎంత కాదన్నా కొన్ని కోట్ల మంది అభిమానులు వున్నారు పవన్ కళ్యాణ్ కు. వారు ఓట్లు వేయకపోవచ్చు. కానీ పవర్ స్టార్ నామ స్మరణతో తరించిపోతారు. 

అలాంటి వాళ్ల ఆరాధ్యదైవం లాంటి పవన్ ను కొన్ని రోజులు ఢిల్లీలో పడిగాపులు పడేలా చేసారు అంటే వారికి నిజంగా అతని స్థాయి తెలియదా? లేదా రాజకీయాల్లో  తెలిసేలా చేసారా? అన్నది జవాబు తెలియాల్సి ప్రశ్న. ఇన్నాళ్లలో ఒకే ఒక్కసారి వెళ్లి, ఒకే ఒక్కసారి కలవాలి అనుకుంటే ఆఖరికి ఏదో కలిసాం అనిపించి, శాలువా కప్పేసి వెనక్కు చక్కా వచ్చారు.

ఎవరికి వారే..

ఏ ముహుర్తాన పొత్తు పెట్టుకున్నారో తెలియదు కానీ ఎవరిదారి వారిదిగా వెళ్తున్నారు భాజపా-జనసేన. వారి ఉద్యమాలు, వ్యవహారాలు వారివి. వీరి వ్యవహారాలు వీరివి. వాళ్లు పోరు సాగించిన చోటుకు వీరు వెళ్లరు. వీరు వీరంగం ఆడిన చోటికి వారు వెళ్లరు. 

సరే ఇదంతా ఓ స్ట్రాటజీ అనుకుందాం. ఎవరికి వారు వారి వారికి నచ్చిన చోట్ల బలోపేత కావడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుందాం. కానీ పార్టీ బలోపేత కార్యక్రమాల విషయంలోనే ఎక్కడో తేడా కొడుతోంది. అదేంటో ఓసారి పరిశీలిద్దాం.

'కాపు'కాసే ప్రయత్నం

కన్నా లక్ష్మీనారాయణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా వున్నపుడు, తేదేపా అధికారం కోల్పోగానే, ఆ పార్టీకి వెన్నుదన్నుగా వున్న సామాజిక వర్గం వలసలు ప్రారంభించింది. చంద్రబాబు తన తరపున భాజపాలో పని చేయడానికి ఆ వర్గాన్ని అటు డైవర్ట్ చేస్తున్నారని వార్తలు ప్రారంభమయ్యాయి. పైగా కన్నా లక్ష్మీనారాయణ కూడా బాబుగారి మైండ్ సెట్ కు అనుగుణంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇదిలా కొంతకాలం సాగింది.

అంతలోనే భాజపా అధిష్టానం కన్నాను పక్కన పెట్టి సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. సోము వస్తూనే భాజపాలో వున్న బాబుగారి భజన బృందానికి ముకుతాడు వేసారు. గత కొన్నాళ్లుగా ఆ వర్గం నుంచి ఒక్కరంటే ఒక్కరు పల్లెత్తు మాట మాట్లాడితే ఒట్టు. మన్నుతిన్న పాముల్లా ఎక్కడివారు అక్కడ సైలంట్ అయిపోయారు.

ఇలా ఆ వర్గానికి ముకుతాడు వేసిన తరువాత కాపు సామాజిక వర్గాన్ని భాజపావైపు ఆకర్షించే పనికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే అనుమానం కలుగుతోంది. సోము వీర్రాజు తన సామాజిక వర్గానికి చెందినవారిని పార్టీలోకి ఆహ్వానించి, తనను పార్టీని బలోపేతం చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ ఇక్కడ వేరే మతలబు వుంది.

జనసేన పార్టీ ఎంత కాదన్నా, ఎంత బుకాయించినా, దాని పునాదులు కాపు సామాజిక వర్గంపై ఆధారపడి వున్నాయన్నది వాస్తవం. పవన్ చుట్టూ వుండి పార్టీ పనులు చేస్తున్నవారు, లేదా ఎన్నికల్లో పవన్ కోసం అన్ని వ్యవహారాలు చూసిన వారు ఇలా చాలా అంటే చాలా మంది ఆ సామాజిక వర్గమే. 

పైగా పవన్ కు అన్ని వర్గాల అభిమానులు వున్నా, కాపు సామాజిక వర్గం లో వున్న అభిమానుల అభిమానం, తీవ్రత వేరు. పైగా ఎన్ని కబుర్లు చెప్పినా మెజారిటీ కమ్మవారు తేదేపాను వదలరు, మెజారిటీ రెడ్లు వైకాపాను వదలరు. అందువల్ల జనసేనకు బలం చేకూర్చాల్సింది కాపు సామాజిక వర్గమే.

ఇలాంటి నేపథ్యంలో కాపు నేతలను, కాపులను భాజపావైపు లాగేసే ప్రయత్నం చేయడంలో సోము వీర్రాజు అంతరంగం ఏమై వుంటుంది? అసలే కార్యవర్గాలు ఏర్పాటు చేయక, నాయకులను అఫీషియల్ గా ప్రకటించక, తన సినిమాలు తాను చేసుకుంటూ, మధ్య మధ్యలో టైమ్ పాస్ రాజకీయాలు చేసుకుంటున్నారు పవన్. అలాంటి నాయకుడిని కార్యకర్తలు నమ్ముతారేమో కానీ నాయకులు నమ్మడం కష్టం. అందుకే కాపు నాయకులను భాజపా వైపు లాగుతున్నారేమో సోము వీర్రాజు.

మరి ఇలా అయితే జనసేన బలోపేతం కావడం సాధ్యమేనా? నాయకులు అందరినీ భాజపా లాగేస్తే జనసేన పరిస్థితి ఏమిటి? పొత్తు ధర్మం అనేది ఇలాగే వుంటుందా? కులాల తూకం ప్రకారమే రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరు ఎంత కాదన్నా అది వాస్తవం. కమ్మలకు టీడీపీ, రెడ్లకు వైకాపా అని ఓటు వేసే ప్రతి పది మందిలో అయిదుగురికి తెలుసు. 

ఇలాంటపుడు ఆ రెండు పార్టీలకు ఆల్టర్ నేటివ్ గా ఎదగాలి అనే భాజపా-జనసేన కూటమి వ్యూహం ఎలా వుండాలి? జనసేనకు ఎలాగూ కాపుల అండ వుంది కాబట్టి, ఆ వర్గాన్ని భాజపా టచ్ చేయకుండా వదిలేయాలి. భాజపా వేరుగా బలం పెంచుకుని, జనసేన కూడా బలోపేతం అయితే అప్పుడు రెండూ సమ ఉజ్జీలుగా నిలుస్తాయి. పొత్తు ధర్మం బలంగా వుంటుంది.  

బేరాలు ఎలా సాధ్యం?

రేపు భవిష్యత్ లో జనసేన బలంగా బేరమాడడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు భాజపా వ్యూహంతో జనసేనకు కొత్తగా బలపడే అవకాశం కనిపించడం లేదు. ప్రతి జిల్లాలో రెండు ప్రధాన పార్టీల లోకి వెళ్లలేని నాయకులు అంతా భాజపా వైపు చూస్తున్నారు. వెళ్లే వాళ్లు అటే వెళ్తున్నారు. 

ఇలా అయితే మరి కొన్నాళ్లకు జనసేన పరిస్థితి ఏమిటి? పోటీ చేయడానికి అభ్యర్థులు ఎక్కడి నుంచయినా దొరకుతారు. కానీ పార్టీకి ఓ ఇమేజ్ రావాలంటే లోకల్ గా ఎక్కడికక్కడ నాయకులు కూడా అవసరం. అలా లేనపుడు జనసేనను భాజపా ఎలా కేర్ చేస్తుంది?

సినిమాలు చేసుకుంటూ, అప్పుడప్పుడు జనాల్లోకి వెళ్తూ పోతుతున్నారు తప్ప పార్టీ బలోపేతం మీద పవన్ దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. నిజానికి ఇది సరైన టైమ్. అటు టీడీపీలోకి, ఇటు వైకాపాలోకి సెట్ కాలేకపోయిన వారిని జనసేనలోకి తెచ్చుకుని పార్టీని బలంగా చేసుకోగలగాల్సి వుంది. కానీ ఆ దిశగా పవన్ ఆలోచనలు చేయడం లేదు. 

ఎంతసేపూ తన ఫ్యాన్స్ ను మాత్రమే నమ్ముకుని వున్నారు. ఆ ఫ్యాన్స్ కూడా 2019లో పవన్ కు ఓటేయలేదని క్లారిటీ వచ్చింది. ఈ విషయం పవన్ కూడా ఒకటి రెండు సార్లు బహిరంగంగా వెల్లడించారు. మరి ఆయనే కేవలం ఫ్యాన్స్ ను నమ్ముకుని, నాయకులను తయారుచేసుకోవడం లేదా చేర్చుకోవడం చేయకుండా పార్టీని ఎలా బలోపేతం చేయాలనుకుంటున్నారు?

భాజపా వ్యూహమేమిటి?

సరే, పవన్ సంగతి అలా వుంచుదాం. ఇంతకీ భాజపా వ్యూహం ఏమిటి? రెండు ప్రధాన పార్టీలు, వాటి వెనుక వున్న రెండు ప్రధాన సామాజిక వర్గాలకు పోటీగా భాజపాను తయారుచేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లడం వరకు బాగానే వుంది. 

కానీ తనతో చేతుల కలిపిన జనసేన గురించి ఎందుకు ఆలోచించడం లేదు? భాజపా కూటమి సిఎమ్ అభ్యర్థి ఎవరు అవుతారు?అద్భుతం జరిగిపోయి టీడీపీ, వైకాపాలకన్నా మెజారిటీ వచ్చేస్తే,  భాజపా-జనసేనల్లో  ఎక్కువ ఎమ్మెల్యేలు ఎవరికి వుంటే వారికి అవకాశం వుంటుంది. 

కానీ ఇప్పుడు భాజపా పన్నుతున్న వ్యూహాల ప్రకారం జనసేనకు ఆ అవకాశం వుండేలా కనిపించడం లేదు. నాయకులు లేని చోట్ల పోటీకి ఎక్కువ సీట్లు అడిగే అవకాశం జనసేనకు వుండదు. ఆ విధంగా అక్కడి నుంచే పవన్ ను కట్టడి చేయడం ప్రారంభమైపోతుంది.

అంటే సుదూరంగా ఆలోచిస్తే, పవన్ కు వున్న ఫ్యాన్స్ బలాన్ని, సామాజిక నేపథ్యాన్ని తెలివిగా వాడుకోవడానికి భాజపా అతనితో చేతులు కలిపిందనుకోవాలి. పల్లకీలో భాజపా కూర్చుంటుంది. జనసేన మోయాల్సి వుంటుంది. ఈ సంగతి గమనించేవరకు ఇలాగే సాగుతుంది. ఆ సమయం వచ్చాక, పవన్ తనకు కొంచెం తిక్కవుంది అంటూ డైలాగ్ చెప్పి, బై బై అంటారు. కానీ అప్పటికే భాజపా ఎంత మేరకు బలోపేతం కాగలదవ అంతా అవుతుంది. 

అప్పుడు మళ్లీ జనసేన ఒంటరి అవుతుంది. అవసరం, అవకాశం, అదను అనే లెక్కలతో వున్న 'దేశం' భాజపాకు దగ్గరగా జరగడానికి కాస్త వీలు కలుగుతుంది. అలా జరగకూడదు అంటే జనసేన బుద్దిగా భాజపా ఇచ్చిన సీట్లు తీసుకుని, భాజపా చెప్పినట్లు వింటూ, దాంతో వుండాలి. లేదూ అంటే వన్ ఫైన్ మార్నింగ్ అందులో కలిసిపోవాలి. సిఎమ్ అభ్యర్థిగా ప్రొజెక్టు కావాలంటే పార్టీలో విలీనం కావాల్సిందే అనే షరతు ముందుకు వస్తే పవన్ అలా చేయకతప్పదేమో?

-చాణక్య

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

ఏపీలో ఈ ప‌రిస్ధితి అవాంఛ‌నీయ‌మైన‌ది!