వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ ఒక్కరినీ విడిచి పెట్టేలా లేరు. తాజాగా ఆయన టీఆర్ఎస్ ఎంపీ కేకే కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై తనదైన స్టైల్లో వ్యంగ్య కామెంట్స్ చేశారు. ఇది వివాదాస్పదంగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మేయర్ విజయలక్ష్మి ఓ చేత్తో కుక్కకు.. మరో చేత్తో తాను తింటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో కాస్త ఆర్జీవీ కంట పడింది. ఇక చెప్పేదేముంది… ఆయనలోని వెటకారి మనస్తత్వం బయటికొచ్చింది.
వర్మ స్పందిస్తూ.. ‘కుక్కపై మేయర్ ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంది. కుడి చేత్తో కుక్కకు తినిపిస్తూ ఎడమ చేత్తో తాను తింటున్నారు. ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్గా ఎంపిక చేయాలి. ఆమె కుక్కపై చూపుతున్న ప్రేమకు దీటుగా ప్రజలను ప్రేమించగలరా? కుక్కను ఆమె అంతగా ప్రేమించడాన్ని చూస్తుంటే మరో జన్మలో నేను కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నాను.
ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవంగా కుక్కను చూసి అందరూ ఈర్ష్య చెంది ఉంటారు’ అని ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కుక్కనే అంతగా ప్రేమిస్తున్నప్పుడు, ఇక మనుషులను ఆమె ఎంతగా ఆదరిస్తారో అర్థం చేసుకోవాలని వర్మకు హితవు చెప్పే కామెంట్స్ కూడా తక్కువేం కాదు. మరికొందరు నెటిజన్స్ మాత్రం కుక్కపై కనబరిచే ప్రేమలో 25 శాతం హైదరాబాద్ నగరంపై చూపితే చాలు … చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని కామెంట్స్ చేశారు. మొత్తానికి వర్మ ఓ వివాదానికి తెరలేపారన్న మాట.