రోజులెప్పుడూ ఒకేలా ఉండవంటారు. దీనికి హైకోర్టులో ఎస్ఈసీకి వరుసగా ఎదురవుతున్న పరిస్థితులను నిలువెత్తు నిదర్శ నంగా చెప్పుకోవచ్చు. తాజాగా కోర్టు చెప్పినట్టు చేయకుండా క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎస్ఈసీకి ఎదురైంది. ఇందుకు దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం.
గతంలో జారీ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసి, రీ నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేనతో పాటు పలు సంస్థలు, వ్యక్తులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు రీనోటిఫికేషన్ వ్యవహారంపై విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేయకపోగా, మరికొంత సమయం కావాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ కోర్టు కేసులున్నాయనే కారణంతో ఎస్ఈసీ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్‌ఈసీ తరపున న్యాయవాది క్షమాపణ చెప్పారు. సోమవారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అప్పటికి కూడా కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం హెచ్చరించింది. తదుపరి విచారణను ఈనెల 8కి హైకోర్టు వాయిదా వేసింది.