టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో వీహెచ్ కూడా!

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా నేప‌థ్యంలో ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. వాస్త‌వానికి అప్పుడెప్పుడో హుజూర్ న‌గ‌ర్ బై పోల్ లో…

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా నేప‌థ్యంలో ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. వాస్త‌వానికి అప్పుడెప్పుడో హుజూర్ న‌గ‌ర్ బై పోల్ లో కాంగ్రెస్ ఓడిపోయిన‌ప్పుడే ఉత్త‌మ్ రెడ్డి రాజీనామా చేశారు. అప్ప‌టి నుంచి మ‌రొక‌రిని ఆ ప‌ద‌వికి ఎంపిక చేయ‌లేదు. జీహెచ్ఎంసీ పోల్స్ లో కాంగ్రెస్ మ‌రోసారి చిత్తు కావ‌డంతో ఉత్త‌మ్ రెడ్డి ఇంకోసారి రాజీనామా చేశారు.

మ‌రి ఇప్పుడైనా టీపీసీసీకి కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడిని నియ‌మిస్తుందో లేదో కానీ.. పోటీదారులు మాత్రం చేతులెత్తుతున్నారు! మీడియా ప్ర‌తినిధుల క‌నిపిస్తే చాలు.. వారు తాము కూడా రేసులో ఉన్న‌ట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు కూడా ఆ ప‌ద‌విని ఆశిస్తున్నార‌ట‌. ఆయ‌నే ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పుకున్నారు.

త‌న వ‌య‌సు వాళ్లు చాలా రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రులుగా ఉన్నార‌ని, కాబ‌ట్టి త‌నుకూడా పీసీసీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గ‌ల‌నంటూ ఆయ‌న చెప్పుకుంటున్నారు. త‌ను కూడా టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న‌ట్టుగా వీహెచ్ చెప్పుకుంటున్నారు. 

వీహెచ్చే కాద‌ట‌.. జ‌గ్గారెడ్డి కూడా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విని ఆశిస్తున్నార‌ట‌. రేవంత్ రెడ్డికి ద‌క్క‌కూడ‌ద‌నేది జ‌గ్గారెడ్డి లెక్క‌ట‌. ఇక కోమ‌టిరెడ్డి సోద‌రులు కూడా టీపీసీసీ అధ్యక్ష ప‌ద‌వి మీద చాలా ఆశ‌లే పెట్టుకున్న‌ట్టుగా ఉన్నారు.

మొత్తానికి కాంగ్రెస్ ను గెలిపించే బాధ్య‌త‌లు ఎవ‌రూ తీసుకుని ప‌ని చేయ‌రు కానీ, ప‌ద‌వులు అంటే మాత్రం.. కాంగ్రెస్ లో ఉండే అంతఃక‌ల‌హాలు య‌థాత‌థంగా కొన‌సాగేలా ఉన్నాయి. ఇన్నాళ్లూ ఇవి టీఆర్ఎస్ కు క‌లిసొచ్చాయి, ఇక‌పై బీజేపీకి క‌లిసొచ్చేలా ఉన్నాయి!

తెరాస ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్