కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ట్వీట్ ద్వారా పదునైన అస్త్రం సంధించారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ ఫొటోలు వైరల్ గా మారి, దుమారం రేగుతున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ నేపాల్ నైట్ క్లబ్ లో పార్టీ చేసుకున్నారని, ఆ పార్టీలో నేపాల్ లోని చైనా రాయబారి హూయాంక్వీ పాల్గొన్నారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఒకవైపు హనీట్రాప్ లను పన్నడంలో చైనా దిట్టగా పేరుపొందిన విషయాన్ని కూడా విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూరప్ పర్యటనపై రాజకీయ ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు.. రాహుల్ పార్టీపై ఏమంటన్నారన్నట్టుగా విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
ఈ ట్వీటు చేసింది ప్రాంతీయ పార్టీ ఎంపీ అయినప్పటికీ కాంగ్రెస్ కు మాత్రం బాగా కాలినట్టుగా ఉంది. ఈ ట్వీట్ పై కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ స్పందించారు. విజయసాయి రెడ్డిని అవినీతి పరుడుగా అభివర్ణిస్తూ.. రాహుల్ కేవలం స్నేహితుడి ఇంటి పెళ్లికి వెళ్లారంటూ వివరణ ఇచ్చుకున్నారు. మామూలుగా పెళ్లికి వెళ్లి ఉంటే అదేమంత విడ్డూరం కాదు కానీ, చైనా రాయబారి పక్కన రాహుల్ ఫొటోలు మాత్రం రుచించవు ఎవరికీ.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సూచనలు చేస్తూ.. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా మెలగాలంటూ చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ తో జతకట్టే ఉద్దేశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
ఇలాంటి నేపథ్యంలో.. రాహుల్ పై ట్వీట్ ద్వారా.. తమ ఉద్దేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా స్పష్టం చేసినట్టుగా ఉంది!