ఏ వృత్తిలో అయినా పరుగు ఆపడం అన్నది చాలా కీలకం. గవాస్కర్ ఇన్ టైమ్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పినా, శోభన్ బాబు ఇన్ టైమ్ లో సినిమాలు వదిలేసినా ఇలాంటి డేరింగ్ నిర్ణయం తీసుకోగలిగినందువల్లే. కొసకంటా లాగి, చివరకు జనాలు దూరం పెట్టేసే పరిస్థితి తెచ్చుకోకుండా గౌరవ ప్రదమైన రిటైర్మెంట్ తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. నిబద్దత కావాలి. మెగాస్టార్ చిరంజీవి అలాంటి ధైర్యం, నిబద్ధత కనబర్చాల్సిన సమయం వచ్చేసినట్లు కనిపిస్తోంది.
ఆచార్య సినిమా ఫలితం అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేవలం సినిమా పరాజయం అన్నది కాదు క్వశ్చను. సినిమాకు సరైన ఓపెనింగ్స్ ఎందుకు రాలేదన్నది పాయింట్. పరిస్థితులు బాగా లేవు అంటే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 కలెక్షన్లు నిలదీస్తున్నాయి. కేజీఎఫ్ 2 ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
పోనీ స్టార్ కాస్ట్ సరిపోలేదు అంటే చిరంజీవితో పాటు లక్కీ లెగ్ పూజా హెగ్డే, యంగ్ మెగాస్టార్ రామ్ చరణ్ వున్నారు. బ్యానర్ కూడా మంచి బ్యానర్. డైరక్టర్ ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ. మరి ఇలాంటి సినిమాకు ఎందుకు ఓపెనింగ్ రాలేదు. సినిమా బాలేకపోతే మర్నాటి నుంచో, మండే నుంచో కిందకు జారిపోతుంది. కానీ అసలు తొలి రోజు తొలి ఆటలే చాలా చోట ఫుల్ కాలేదు అంటే మెగాస్టార్ చరష్మా మీద అనుమానం కలుగుతుంది.
చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చేసిని ఖైదీ నెంబర్ 150 ఓ మ్యూజికల్ హిట్. ఏదో కష్టపడి మెగాస్టార్ కూడా పాటలకు డ్యాన్స్ లు చేసారు. చాలా గ్యాప్ వచ్చింది కనుక ఫ్యాన్స్ చూసారు. పాటలు బాగా వైరల్ అయ్యాయి. సక్సెస్ లో అవి కూడా భాగం అయ్యాయి. కానీ ఎంత పబ్లిసిటీ చేసినా, సైరా అనే సినిమా పరాజయాన్ని చవి చూసింది. ఆ సినిమా బ్యాడ్ సినిమా కాదు. ఎందుకంటే అది ఓ హిస్టారికల్ బయోపిక్. ఎంచడానికి ఏమీ లేదు. కానీ మెగాస్టార్ డ్యాన్స్ లను, మాస్ వ్యవహారాలను మాత్రం జనం లైక్ చేయలేదు.
తరువాత ఇప్పుడు ఆచార్య వచ్చింది. దీనికి దాదాపు నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. ప్రజల అభిరుచులు మారిపోయాయి. ప్రపంచ సినిమాకు ఎక్స్ పోజ్ అయ్యారు. వెబ్ సిరీస్ లు చూస్తున్నారు. కొత్త కొత్త నటనను పరిచయం చేసుకుంటున్నారు. కొంత జానర్లను టచ్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో చిరంజీవిని అభిమానించే వారు వున్నా, వారి సంఖ్య పరిమితం అయిపోయింది. ఇప్పుడు సినిమా చూసే ఆడియన్స్ లో చిరంజీవిని తెరపై చూడాలనుకునేవారి సంఖ్య చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదు.
ఈ పరిస్థితి ఆయనకు మాత్రమే కాదు. సీనియర్ హీరోలు నాగ్, వెంకీ, రవితేజ కూడా ఫేస్ చేస్తున్నారు. ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా. పవన్ భీమ్లా నాయక్ కు అంత హడావుడి జరిగినా, అంత బజ్ వచ్చినా, మంచి రేటింగ్ లు వచ్చినా, నైజాంలో 33 కోట్లు చేయడం కష్టం అయింది. మరో ఒకటి రెండు సినిమాలు వస్తే ఆయన విషయంలో కూడా క్లారిటీ వచ్చేస్తుంది.
బాలకృష్ణ చాలా సినిమాల తరువాత అఖండతో సక్సెస్ కొట్టారు అంటే దానికి చాలా ఫ్యాక్టర్లు వున్నాయి. రవితేజ విషయంలో కూడా త్వరలో మరింత క్లారిటీ వచ్చేలాగే వుంది. మోహన్ బాబు వైవిధ్యమైన పాత్ర అనుకుని సినిమా చేస్తే దారుణమైన ఫలితం చవి చూసారు. సినిమా మంచి చెడ్డలు కాదు, సీనియర్ హీరోలు అంటే యంగ్ ఆడియన్స్ అటు తొంగి చూడడం లేదు. ఆ విషయం గమనించాల్సి వుంది. నిర్మొహమాటంగా ఒప్పుకోవాల్సి వుంది. 90ల్లో ఆ తరువాత పుట్టిన వారు ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. వారికి ఈ సీనియర్ల కన్నా యంగ్ హీరోలు అంటే ఇష్టంగా వుందన్నది వాస్తవం.
కరోనా తరువాత రెమ్యూనిరేషన్లు భయంకరంగా పెరిగాయి. హీరోల కొరత వెన్నాడుతోంది. దాంతో ఎవరు దొరికితే వారు అన్నట్లు సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. తమ కెరీర్ లో ఎప్పుడూ చూడనంత రెమ్యూనిరేషన్లు కళ్ల ముందు కనిపిస్తుంటే సీనియర్లు అంతా సినిమాలకు సై అంటున్నారు. కానీ రాబోతున్న సినిమాల ఫలితాలు బట్టి ఈ సీనియర్ల కెరీర్ ఎలా వుండబోతుంది అన్నది క్లారిటీ వస్తుంది. మిగలిన వారి సంగతి ఏమో కానీ మెగాస్టార్ వ్యవహారం వేరు. ఆయన నటుడిగా, హీరోగా తన గౌరవాన్ని ఓ రేంజ్ లో నిలబెట్టుకోవాల్సి వుంటుంది.
మెగాస్టార్ ఓ మాంచి హిట్ కొట్టి తన పరుగు ఆపడం మంచింది. ఆ మంచి సినిమాతో జనాల గుండెల్లో గుర్తుండిపోతారు. లేదూ ఇలా సినిమా మీద సినిమా ట్రయ్ చేస్తూ, అదృష్టం బాలేక పరాజయాలు చవి చూస్తే ఫ్యాన్స్ కు చాలా బాధాకరంగా వుంటుంది. కాంబినేషన్ లో సినిమాలు చేసేస్తే ఆడతాయి అనుకుంటే పొరపాటే. చిరు కన్నా ముందే వెంకటేష్ ఇలాంటి ప్రయత్నాలు చేసి, మసాలా వంటి డిజాస్టర్లు చవి చూసారు. ఇప్పుడు చిరు రవితేజ, సల్మాన్ ఖాన్ ఇలా కాంబినేషన్లు ట్రయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కాంబినేషన్ కన్నా గొప్పవేమీ కాదు కదా?
మరో సినిమా వరకు ఆగి మెగాస్టార్ ఆలోచించుకోవాలి. అమితాబ్, మోహన్ లాల్ మాదిరిగా మాంచి పాత్రలు వస్తే చేయడం లేదంటే విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆ విధంగా మెగాస్టార్ అనే పేరు నిలబడుతుంది.
జోశ్యుల శ్రీనాధ్