అతి పెద్ద బాధిత రాష్ట్రం

అవును. ఆంధ్ర ప్రదేశ్ బాధిత రాష్ట్రమే. అన్ని రకాలుగా కునారిల్లిన రాష్ట్రమే. విభజన నుంచి గాయాలు, పాపాలు అలా ఏళ్ళకు ఏళ్ళుగా వెంటాడుతున్నాయి. ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు అయిందని అవేమీ ఆగవు కదా.…

అవును. ఆంధ్ర ప్రదేశ్ బాధిత రాష్ట్రమే. అన్ని రకాలుగా కునారిల్లిన రాష్ట్రమే. విభజన నుంచి గాయాలు, పాపాలు అలా ఏళ్ళకు ఏళ్ళుగా వెంటాడుతున్నాయి. ఉమ్మడి ఏపీ రెండు ముక్కలు అయిందని అవేమీ ఆగవు కదా. అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన ప్రైవేటీకరణ విధానాలను అమలు చేసుకుంటూ పోతోంది.

దీని వల్ల అంతా బాగున్న రాష్ట్రాలకే ఇబ్బందిగా ఉంది. మరి అన్ని రకాలుగా అవస్థలు పడుతున్న ఏపీకి ఎలా ఉంటుంది అన్నది ఆలోచించుకుంటేనే భయం పుడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఏపీలో కొన్ని విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేట్ లిస్ట్ లో ఉన్నాయి.

దాంతో రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగంలో ప్రైవేటీకరణ వల్ల అతి పెద్ద బాధను అనుభవిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. నిజంగా ఇది పెద్ద మాట. బాధతో వచ్చిన మాట. ఏ రకమైన విశ్లేషణలు చేసుకోకుండా ఎంత అర్ధం చేసుకుంటే ఎవరికైనా అంతలా అర్ధం అయ్యే మాట.

మరి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికే చాలా సార్లు డిమాండ్ చేశారు కూడా. ఇపుడు మేము బాధితులం అని కూడా కుండబద్ధలు కొట్టినట్లుగా కేంద్రానికి చెప్పుకున్నారు. మరి ఇంత లోతైన భావాన్ని చెప్పినా కేంద్రం వింటుందా. ఆలకిస్తుందా.

ప్రైవేట్ రూట్ లో దూకుడుగా సాగిపోతున్న కేంద్ర పెద్దలు ఈ ప్రక్రియ నుంచి తగ్గుతారా. విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలిపీఠం ఎక్కించకుండా వదిలిపెడతారా. చూడాలి మరి. ఏది ఏమైనా ఒకే ఒక్క ముక్కలో ఏపీ మొత్తం పరిస్థితిని విజయసాయిరెడ్డి వివరించిన తీరు మాత్రం బాగుందని అంతా అంటున్నారు.