ఎన్టీఆర్ ని పక్కనపెట్టారు.. బాబు జపం చేస్తున్నారు

టీడీపీకి 40 ఏళ్లొచ్చాయి. ఏ పార్టీ అయినా దాని ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ వ్యవస్థాపకుడిని తలచుకోవడం సహజం. కానీ టీడీపీలో మాత్రం ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. బాబు జపం చేస్తున్నారంతా. 40ఏళ్లలో…

టీడీపీకి 40 ఏళ్లొచ్చాయి. ఏ పార్టీ అయినా దాని ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ వ్యవస్థాపకుడిని తలచుకోవడం సహజం. కానీ టీడీపీలో మాత్రం ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. బాబు జపం చేస్తున్నారంతా. 40ఏళ్లలో పార్టీని సంకనాకించినందుకు 294 అసెంబ్లీ సీట్లున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 23  సీట్లకు పరిమితమై, అందులో 19మంది ఎమ్మెల్యేలే చేతిలో ఉన్నందుకా బాబుకి ఈ గౌరవం. 

ఇప్పటికైనా ఆత్మవిమర్శ మొదలుకావాలి. పగ్గాలు నారావారి చేతిలో ఉన్నాయా, నందమూరి వారి చేతిలోనా అన్నది పక్కనపెడితే.. సమర్థులైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తేనే పార్టీ పరువు దక్కుతుంది.

40ఏళ్లలో ఎంత దిగజారారు..?

టీడీపీ 40 ఏళ్ల వైభవం అంటూ గత చరిత్రను తవ్వి తీస్తోంది ఆ పార్టీ అనుకూల మీడియా. అప్పట్లో అన్నిసార్లు అధికారంలోకి వచ్చారు, ఇన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటూ చరిత్ర చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ని మాత్రం పక్కనపెట్టారు. 

పార్టీ అసలు చంద్రబాబుదే అన్నట్టు, చంద్రబాబే పార్టీని ఈ స్థాయికి చేర్చారని, ఆ స్థాయి విజయాలందించారని బాకాలూదుతోంది అనుకూల మీడియా. పనిలో పనిగా లోకేష్ కి కూడా జాకీలేస్తోంది. భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తోంది.

టీడీపీ గత చరిత్ర చూస్తే.. 2024లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే అంచనాలు వేస్తోంది. కానీ 40 ఏళ్లలో ఎక్కడ మొదలు పెట్టి, ఎక్కడికి దిగజారారు అనేది మాత్రం లెక్కేయడంలేదు. అసలు టీడీపీలో నికరంగా ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలారు అనే ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు.

సంచలనాలుంటాయా..?

టీడీపీలో సంచలనాలేవీ ఉండవు, ఉండబోవు కూడా. నాయకులు, కార్యకర్తలకు కూడా ఈ విషయం అర్థమైపోయింది. నారావారి చేతుల్లోనుంచి పగ్గాలు బయటకు వెళ్లకూడదు. బాబు తర్వాత లోకేష్ నాయకుడవ్వాలి, అందరూ ఆయనకంటే తక్కువగా ఉండాలి. అదీ అక్కడ ఫార్ములా. అందుకే లోకేష్ ని మించి ఆలోచించే వారికి అక్కడ స్థానం లేదు. చినబాబుకి పోటీ ఇచ్చేవారు అక్కడ పోటీలో ఉండకూడదు. అలా తమకు తామే పార్టీని దిగజార్చుకుంటున్నారు టీడీపీ అధినేత. మామ నుంచి లాక్కున్న పార్టీని కొడుకు కోసం సమాధి చేస్తున్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో ఎలా కొట్టుమిట్టాడుతుందో, ఇక్కడ టీడీపీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. కనీసం అక్కడ కొంతమంది నాయకులైనా పార్టీ వాస్తవ పరిస్థితిని సోనియా ముందుకు తీసుకెళ్లే ధైర్యం చేస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి వారు కూడా లేరు. పార్టీ పరిస్థితిని చంద్రబాబుకి వివరించి చెప్పేంత ధైర్యం ఎవరూ చేయడంలేదు. అందుకే టీడీపీ గత చరిత్రగానే మిగిలిపోతోంది.

ఈ ఏడాది 40, వచ్చే ఏడాది 41.. ఇలా లెక్కలు చెప్పుకోవాల్సిందే కానీ.. ఏళ్లు పెరుగుతున్నా ఎమ్మెల్యేల సంఖ్య ఎందుకు తగ్గుతోందనే దిగులు, బాధ వారిలో ఏ కోశానా లేదు. అందుకే టీడీపీది ఒకప్పుడు ఎగసిపడే రాజకీయం అయితే, ఇప్పుడు ఏడుపుగొట్టు రాజకీయంగా మారింది.