తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త పేరు పెట్టారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అది టీపీసీసీ కాదని, టీబీసీసీ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి పెత్తనం ఇవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాబు కాంగ్రెస్ గా మారిందని విమర్శించారు. టీపీసీసీ కాస్తా టీబీసీసీ (తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ)గా మారిపోయిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం వెనక చంద్రబాబు హస్తం ఉందని అన్నారు విజయసాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనేసి, తెలంగాణలో బాబు తన శిష్యుడికి పీసీసీ పీఠం ఇప్పించుకున్నారని చెప్పారు.
గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించిన బాబు, ఇప్పుడు డైరెక్ట్ గా తన మనిషిని టీపీసీసీ అధ్యక్షుడిని చేసి తెలంగాణ కాంగ్రెస్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
పొలిటికల్ బ్రోకర్ బాబు..
పొలిటికల్ బ్రోకర్ గా చంద్రబాబు తన విశ్వరూపం ప్రదర్శించాడని అన్నారు విజయసాయిరెడ్డి. “రాహుల్ గాంధీని 'ఇంప్రెస్' చేయడానికి ఏం 'మంత్రం' వేశాడో కానీ టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడు.
అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడు. తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో ఇక” అంటూ ట్వీట్ చేశారు.
అప్పుడు బీజేపీ తీర్థం.. ఇప్పుడు కాంగ్రెస్ పై పెత్తనం..
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసుల నుంచి రక్షణ కోసం టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించింది కూడా చంద్రబాబే నని విమర్శించారు విజయసాయిరెడ్డి.
“మనవాళ్లు బ్రీఫ్డ్ మీ” కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేందుకు ఏకంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణని గులాబీ పార్టీలోకి చొప్పించాడని విమర్శించారు. “పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడుగట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలాడు. బాబా మజాకా!” అంటూ ట్విట్టర్ లో సెటైర్లు పేల్చారు విజయసాయి.