కర్షక, కార్మిక, రైతుకూలీల కోసం సినిమాలు తీయడమే కాదు, నిజ జీవితంలోనూ ఉద్యమబాట పట్టిన ఘనత ఆర్.నారాయణ మూర్తికే దక్కింది. అంతేకాదు, రైతుల కోసం ఆయన అరెస్ట్ కూడా అయ్యారు.
ఇది రైతులపై ఆయనకున్న నిబద్ధత. ఆర్.నారాయణమూర్తి పేరు వినగానే ఎర్రసైన్యం, చీమలదండు లాంటి విప్లవకర సినిమాలు గుర్తుకొస్తాయి. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ట్రెండ్‌ను దాసరి నారాయణరావు శిష్యుడైన నారాయణమూర్తి ఏర్పరచుకున్నారు.
ప్రస్తుతానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆర్.నారాయణమూర్తి రైతులకు మద్దతు ఇవ్వడంతో పాటు వారితో కలిసి హైదరాబాద్‌లో రాజ్‌భవన్ వైపు ఉద్యమించారు.
అయితే రైతులు చేపట్టిన ఈ ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. రైతులతో పాటు నారాయణమూర్తిని కూడా అరెస్ట్ చేయడం గమనార్హం. నారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త రైతు చట్టాల కారణంగా రైతులు కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతారని హెచ్చరించారు. ఇదిలా ఉండగా రైతులపై ప్రేమాభిమానాలు కేవలం సినిమాల్లో కార్చే మొసలి కన్నీటికే పరిమితం చేయకుండా, రియల్ లైఫ్‌లో కూడా వారి కోసం ఉద్యమించిన నారాయణమూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.