విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ ఆనందం ఎంతో కాలం నిలవలేదా? అవుననే సమాధానం టాలీవుడ్ నుంచి వస్తోంది. మళ్లీ సినిమాల్లో నటించాలన్న ఆమె ప్రయత్నాలు ఎక్కడో ‘అశాంతి’ని రేపినట్టున్నాయి. తాజాగా విజయశాంతి చేసిన ఓ ట్వీటే ఇందుకు ఉదాహరణ అని చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
విజయశాంతి ట్వీట్‌పై టాలీవుడ్‌తో పాటు రాజకీయ రంగంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటీవలే ఆమె తనకు మంచిపాత్ర వస్తే తప్పక నటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇంతలోనే ఏం జరిగిందో కానీ, అందుకు భిన్నమైన ట్వీట్ చేశారామె.
సోమవారం విజయశాంతి చేసిన ట్వీట్ ఏంటంటే…
‘సరిలేరు మీకెవ్వరు …ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన , నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానంలో కళ్లుకుల్ ఐరమ్, కిలాడి కృష్ణుడు (1979) నుంచి …నేటి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం…మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తుందో లేదో నాక్కూడా తెలియదు. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆరణకు , నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు….మీ విజయశాంతి’ అని ఆమె ట్వీట్ చేశారు.
ఇటీవల సినిమాల్లో నటించే విషయమై విజయశాంతి పెట్టే కండీషన్స్ విని దర్శకులు భయపడుతున్నారని విస్తృతంగా చర్చ జరుగుతోంది. పెద్ద హీరోలతో తప్ప చిన్నవాళ్లతో తాను చేసేది లేదని స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగే హీరోతో సమానంగా తనకు ప్రచారంలో భాగస్వామ్యం కల్పించడం, ఇతరత్రా అనేక డిమాండ్స్ ఏవైనా భూమ్‌రాంగ్ అయ్యాయా అనే చర్చ నడుస్తోంది.
విజయశాంతి ట్వీట్ చేసినట్టు ఆమె పార్టీ(కాంగ్రెస్)కి చెందిన నాయకులకే ఏ పనీలేక ఖాళీగా ఉన్నారు. అలాంటిది ఈమె మాత్రం ఏ ప్రజాపోరాటాలు చేస్తారని రాజకీయ, సినీవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సినిమా అవకాశం రావాలే గానీ, నటించే సమయం లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా తనవల్లే హిట్ సాధించిందనే భావనతో విజయశాంతి డిమాండ్స్ పెడుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. బహుశా అదే రివర్స్ అయినట్టుందనే ప్రచారం నడుస్తోంది. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. ఈ రోజు కాకపోతే…రేపైనా నిజం బయటికి రాక తప్పదు కదా? ట్వీట్ ముడి వీడక తప్పదు.