జగన్ ను ఇరుకున పడేస్తున్నారా?

ఇవాళ్టి పరిస్థితుల్లో పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మలేని వాతావరణం ఉంది. తమ తమ రాజకీయ భావజాలాలకు అనుగుణంగా ఉండే అంశాలను మాత్రమే హైలైట్ చేసి.. ఒక కార్యక్రమంలో మిగిలిన వాటిని…

ఇవాళ్టి పరిస్థితుల్లో పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఒక పట్టాన నమ్మలేని వాతావరణం ఉంది. తమ తమ రాజకీయ భావజాలాలకు అనుగుణంగా ఉండే అంశాలను మాత్రమే హైలైట్ చేసి.. ఒక కార్యక్రమంలో మిగిలిన వాటిని పక్కన పెట్టడం అనేది.. అటు పాలక, ఇటు విపక్ష అనుకూల మీడియా సంస్థలకు మామూలైపోయింది. అయితే ముఖ్యమంత్రి సలహాదారు అజేయకల్లం ప్రసంగంలోని వ్యాఖ్యలుగా పత్రికల్లో వచ్చిన విషయాలు నిజమో కాదో ప్రజలు ఒక పట్టాన నమ్మలేని పరిస్థితి. నిజమే అయితే గనుక.. ఆ మాటలు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని ఇరుకున పెట్టేవే అనిపిస్తోంది.

తిరుపతి సమీపం నారావారిపల్లెలో ఎమ్మెల్యే చెవిరెడ్డి.. పెద్ద సభ నిర్వహించారు. ఆ సభలో అజేయకల్లం మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అక్కడక్కడ ఎవరెవరు భూములు కొని, ఇప్పుడు రాజధాని తరలింపునకు అడ్డం పడుతున్నారో ఏకరవు పెట్టారు. పత్రికాధిపతులు పలువురిపై నింద వేయడంలో ఆశ్చర్యం లేదు. కానీ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా అక్కడ భూములు కొనిపెట్టుకున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.

సుప్రీం న్యాయమూర్తులు ఆరోపణలకు అతీతులేమీ కాదు. అంతమాత్రాన వారిని సరైన ఆధారాలు లేకుండా రచ్చకీడ్చటం అనేది తీవ్రమైన విషయమే అవుతుంది. అజేయకల్లం ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిగా ఏం మాట్లాడి ఉన్నప్పటికీ.. పెద్ద పట్టింపులేదు. కానీ.. ఎన్నికలకు ముందు.. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సలహాదారుగా ఆయన మాట్లాడే మాటలకు పట్టింపు ఉంది.

అజేయకల్లం మాటలను ప్రభుత్వాధినేతకు ఆపాదించడానికి, ప్రభుత్వం మాటలుగానే వాటికి రంగుపూసి ప్రచారంలో పెట్టడానికి విపక్షాలు సంకోచించవు. ఇలాంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు కూడా అమరావతి ఆస్తుల గొడవను, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ను ముడిపెడుతూ అజేయకల్లం చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా వివాదాస్పదమే.

ఈ వ్యాఖ్యలు జగన్ ను ఇరుకున పెట్టేవి కూడా. రాష్ట్రానికి సంబంధించి.. దూకుడుగా.. నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ అటు కేంద్రంతో గాని, ఇటు న్యాయవ్యవస్థతో గానీ సత్సంబంధాలు కలిగిఉండడం ఒక వ్యూహాత్మక అవసరంగా ఉంది. ఇలాంటప్పుడు సుప్రీం న్యాయమూర్తుల మీద ఇలాంటి ఆరోపణలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో చూడాలి.

సినిమాలు ఎప్పుడూ మోసం చెయ్యవు మనుషులే