అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు, పరిపాలనా వికేంద్రీకరణపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్. నిజానికి ఇది సరికొత్త ప్రయోగం.. అత్యంత సాహసోపేతమైన ఆలోచన కూడా. దేశంలో జమ్మూకాశ్మీర్‌కి మాత్రమే రెండు రాజధానులున్నాయి. మరోపక్క, దేశంలోని కొన్ని రాష్ట్రాలకు సంబంధించి న్యాయ వ్యవస్థ ఓ చోట, పరిపాలనా రాజధాని ఇంకో చోట వున్నాయి.
చట్ట సభల నిర్వహణకు సంబంధించి కూడా 'వేర్వేరు' వ్యవహారాలు నడుస్తున్న రాష్ట్రాలూ లేకపోలేదు. కానీ, మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది మాత్రం దేశంలో ప్రప్రథమం.. అదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు విడిపోయిందో అందరికీ తెలుసు.
ఆ పరిస్థితి ఇంకోసారి రాకూడదంటే, ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు, పరిపాలనా వికేంద్రీకరణ కూడా జరగాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. మరోపక్క, చట్టపరమైన సమస్యలు కొన్ని వున్నా, 'పరిపాలనా సౌలభ్యం' పేరుతో కార్యాలయాల తరలింపు కూడా షురూ అవుతోంది. ఈ నేపథ్యంలో పరిపాలనా వికేంద్రీకరణపై ప్రజల మన్ననలు పొందేందుకు అధికార పార్టీ తనవంతు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
తాజాగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ఓ బహిరంగ సభ నిర్వహించింది. ప్రజలకు తమ ఉద్దేశ్యమేంటో వివరించింది. పైగా, అది ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాకా కావడం గమనార్హం. వైసీపీ సభలకి జనం కొరత అనే సమస్య తలెత్తదు. కానీ, 'పచ్చ మీడియాకి' ఆ సమస్య బాగానే కన్పించింది. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ.. 'పచ్చ' రాజకీయం షురూ చేసింది. పసుపు నీళ్ళతో సభ జరిగిన ప్రాంగణాన్ని శుద్ధి చేసేసింది.
నిజానికి, 2019 ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజలు శుద్ధి చేసేశారు.. తమ ఓట్లతో. లేకపోతే, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 'ల్యాండ్ స్లైడ్' విక్టరీ ఎలా సాధ్యమవుతుంది.? జగన్ ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా వుంటే, నిలదీసే హక్కు ప్రతిపక్షానికి వుంటుంది. కానీ, అడ్డగోలు వాదనలతో.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడితే ఎలా.? అమరావతి కూడా ఓ రాజధానిగా కొనసాగుతుందన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్నమాట.
ఓ ఏడాది సమయం ఇచ్చి.. ఏవీ కొత్త రాజధానులు.? ఏదీ అభివృద్ధి.? అని తెలుగుదేశం పార్టీ నిలదీస్తే.. అది ఆ పార్టీకి హుందాగా వుంటుంది.. ప్రజలూ, ప్రతిపక్షంతో గొంతు కలుపుతారు. కానీ, ఈ 'పసుపు నీళ్ళతో శుద్ధి' చేయడమేంటి.? ఆ మాటకొస్తే, తొలుత శుద్ధి జరగాల్సింది తెలుగుదేశం పార్టీలోనే. నరనరానా జీర్ణించుకుపోయిన అక్కసును తెలుగుదేశం పార్టీ నేతలు శుద్ధి చేసుకుంటే.. మంచిది.