కేటీఆర్ సీఎం అయ్యే ముహూర్తం చెప్పిన రాములమ్మ‌!

అదిగో.. ఇదిగో.. అంటూ కేటీఆర్ ను తెలంగాణ ముఖ్య‌మంత్రిగా చేసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీ ప‌డుతూనే ఉన్నాయి. క్రితం ట‌ర్మ్ లోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను సీఎంగా చేస్తారంటూ ర‌క‌ర‌కాల ఊహాగానాలు రేగాయి.…

అదిగో.. ఇదిగో.. అంటూ కేటీఆర్ ను తెలంగాణ ముఖ్య‌మంత్రిగా చేసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీ ప‌డుతూనే ఉన్నాయి. క్రితం ట‌ర్మ్ లోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ ను సీఎంగా చేస్తారంటూ ర‌క‌ర‌కాల ఊహాగానాలు రేగాయి.

ఆ ఊహాగానాలు రేప‌డంలో మీడియా ఎంత పాత్ర పోషించిందో, అదే స్థాయిలో టీఆర్ఎస్ వ్య‌తిరేక ప‌క్షాలు ఆ ప్ర‌చారాన్ని చేసి పెట్టాయి. అలాగే కేసీఆర్ అసెంబ్లీ కి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం వెనుక కూడా కేటీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చేసే వ్యూహ‌మే ఉంద‌ని రాజ‌కీయ ప‌క్షాలు ప్ర‌చారం చేశాయి.

లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పాటు జ‌ర‌గాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా ముందుగానే జ‌రుపుతున్నారంటూ, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చేసేసి, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌ను ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్లిపోతారంటూ కేసీఆర్ ఉందో లేదో తెలియ‌ని ఆలోచ‌న‌ను ఆయ‌న వ్య‌తిరేకులు పంచుకున్నారు!

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెల‌వ‌డం, మ‌ళ్లీ కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతూ ఉండ‌టం, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంపీగా పోటీ చేసే ఆలోచ‌నేదీ చేయ‌క‌పోవ‌డం.. ఇదంతా జ‌రిగిపోయింది.

ఈ క్ర‌మంలో మ‌ళ్లీ కూడా టీఆర్ఎస్ వ్య‌తిరేక ప‌క్షాలు కేటీఆర్-సీఎం అనే పాట‌ను ఆప‌డం లేదు.  తాజాగా కేసీఆర్ ఒక‌ప్ప‌టి చెల్లెలు విజ‌య‌శాంతి అదే మాటే చెప్పారు. దుబ్బాక ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు తెగ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, అయితే హ‌రీష్ కు ఝ‌ల‌క్ ఇచ్చి త్వ‌ర‌లోనే కేటీఆర్ ను కేసీఆర్ సీఎంగా చేస్తారంటూ విజ‌య‌శాంతి ఉచిత సానుభూతి వ్య‌క్తం చేశారు.

అందుకు ముహూర్తాన్ని కూడా చెప్పారామె. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు కాగానే.. అని కొత్త ముహూర్తాన్ని ఆమె ప్ర‌క‌టించారు! జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కూ, కేటీఆర్ ను సీఎంగా చేయ‌డానికి సంబంధం ఏమిట‌నేది మ‌నం అడ‌గ‌కూడ‌దు. పుకార్లు పుట్టించే వాళ్ల‌లాగా.. కేటీఆర్-సీఎం అనే పాట విష‌యంలో కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్లు ర‌క‌ర‌కాల మాట‌లు చెబుతూ ఉంటారంతే! 

వీళ్లు ఎంత సానుభూతి ప్ర‌క‌టించినా హ‌రీష్ రావు మాత్రం టీఆర్ఎస్ కే బ‌ద్ధుడై క‌నిపిస్తాడు, కొడుకును సీఎంగా చేసుకోవాల‌నే ఆలోచ‌న కేసీఆర్ కూ క‌నిపించ‌దు! చూస్తుంటే.. కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కాంగ్రెస్, బీజేపీల‌కు ఉన్నంత బాధ్య‌త ఆ ఇంటి వారికే క‌నిపించ‌దు!

దోచుకున్నోడికి దోచుకున్నంత