వీరప్పన్…ఒకప్పుడు ఈ పేరు వింటే అడవిలోని పులులు, సింహాలు, ఏనుగులే గజగజలాడేవి. కళ్లుగప్పి పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళలకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అప్పట్లో ఆయనను అడ్డం పెట్టుకుని చాలా మంది రాజకీయ నాయకులు కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. చివరికి 2004లో అడవి దొంగ వీరప్పన్‌ను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు.
వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్. ఈమె న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె బీజేపీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సమీప భవిష్యత్‌లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో విద్యా వీరప్పన్‌కు తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా బీజేపీ నియమించింది.
బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో బీజేపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు. అందులోనూ వీరప్పన్‌కు బలమైన వర్గం లేకపోలేదు. దాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఇదే సరైన సమయంగా భావించిన బీజేపీ…ఆయన కుమార్తెకు కీలక పదవిని కట్టబెట్టింది.