విశాఖను పాలనా రాజధానిగా ప్రతిపాదించాక ఇప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రి జగన్ విశాఖ టూర్ వేశారు. ఆయనకు బాగానే ప్రజా స్పందన కూడా లభించింది. అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు పాలనను షిఫ్ట్ చేయాలని జగన్ దూకుడు మీద ఉన్నారు. ఇది ఉత్తరాంధ్రా వాసుల్లో కొత్త ఆశలు రేపుతోంది.
సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ టూర్ మాత్రం వరసగా వాయిదాలు పడుతోంది. 2020 వచ్చాక బాబు ఈ వైపుగా తొంగి చూడలేదు. అపుడే రెండవ నెల గడుస్తోంది. నిజానికి బాబు టూర్ షెడ్యూల్ చూస్తే జనవరి 3న విశాఖ రావాలి. ఆ తరువాత మరో రెండు డేట్లు అనుకున్నా మొత్తానికి వాయిదాలు పడ్డాయి
జిల్లాల సమీక్షల్లో భాగంగా బాబు విజయనగరంలో పార్టీ నేతలతో సమీక్ష చేయాలి. పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న దాని మీద ఆయన సమీక్షలు చేస్తున్నారు. చూస్తూంటే ఓడి ఏడాది దగ్గర అవుతోంది. ఇపుడు సమీక్షలు చేసినా ఫలితాలు ఉండవు, ఆ సంగతి అలా ఉంచితే అసలు బాబు ఉత్తరాంధ్రా టూర్ ఇప్పట్లో ఉంటుందా అన్న ధర్మ సందేహాలు తమ్ముళ్ళలోనే ఉన్నాయి.
చంద్రబాబు అమరావతి 29 గ్రామాలనే పట్టుకుని తెగ బిజీ అయిపోయారు. రాజధాని అక్కడే ఉండాలని పట్టుపడుతున్నారు. ఓ విధంగా అదే తనకు అతి ముఖ్యమైన సమస్యగా ఆయన అజెండా చేసి పెట్టుకున్నారు. ఇపుడు విశాఖ తమ్ముళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధినేత మాట మీద జై అమరావతి అనలేరు, జై విశాఖ అని గొంతు కలపలేరు.
వారికి దిశానిర్దేశం చేయాల్సిన బాబు కూడా ఈ వైపు రాకుండా ముఖం చాటేస్తూండడంతో వారిలో ఓ వైపు కంగారు పెరుగుతోంది. మొత్తానికి బాబు ఫిబ్రవరి నెలలోనైనా విశాఖ టూర్ వేస్తారా అన్నది పెద్ద ప్రశ్న. చూడాలి మరి.