'మా దృష్టిలో శాసన మండలి రద్దయిపోయింది.. కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే అనుకుంటున్నాం. అది కూడా త్వరలోనే జరిగిపోతుంది..' అని ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన ముఖ్య నేతలు, మంత్రులు స్పష్టతనిచ్చేశారు. ఓ మంత్రిగారైతే, వచ్చే బడ్జెట్ సెషన్స్ కేవలం ఒక్క శాసన సభకే పరిమితమని తెగేసి చెప్పేశారు కూడా. 'మండలిని రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాక.. అదే క్యాబినెట్, మండలి సమావేశాలకు ఎలా సానుకూలత వ్యక్తం చేస్తుంది.?' అన్నది సదరు మంత్రిగారి వాదన.
అయితే, ఇక్కడ చాలా సాంకేతిక అంశాలు ముడిపడి వున్నాయి.. మండలి రద్దుకి సంబంధించి. కేంద్ర క్యాబినెట్ మండలి రద్దుపై నిర్ణయం తీసుకోవాలి.. సానుకూల నిర్ణయం తీసుకుని, దాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదిస్తే, అది రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి.. గెజిట్ ప్రకటనతో శాసన మండలి రద్దవుతుంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఏడాది సమయం ఖచ్చితంగా పడుతుందని టీడీపీ తన వాదనను విన్పిస్తోన్న విషయం విదితమే.
ఇదిలా వుంటే, శాసన మండలి రద్దుకి కారణంగా మారిన సీఆర్డీయే ఉప సంహరణ బిల్లు, వికేంద్రీకరణ బిల్లులకి సంబంధించి సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే మండలి ఛైర్మన్ ప్రకటించేశారు. మండలి ఛైర్మన్ ఆదేశాల మేరకు, ఆయా పార్టీలు సెలక్ట్ కమిటీ కోసం తమ పార్టీల తరఫున సభ్యుల్ని కూడా ప్రకటించేయడం గమనార్హం.
ఇప్పుడిక వైసీపీ వంతు. మండలి రద్దయిపోయిందనే భావనలో వున్న వైసీపీ, మండలి ద్వారా ఏర్పాటవుతున్న సెలక్ట్ కమిటీకి సభ్యుల లిస్ట్‌ని పంపడం అనేది జరగని పని.. అని వైసీపీ వర్గాలంటున్నాయి. 'అసలు సెలక్ట్ కమిటీకి ఆ బిల్లుల్ని పంపడం అనే ప్రక్రియే జరగలేదు..' అని వైసీపీ కుండబద్దలుగొట్టేస్తోంది. ఈ నేపళ్యంలో, సెలక్ట్ కమిటీ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
అసలంటూ కేంద్రానికి ఈ వ్యవహారాలపై సమాచారమే లేదని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తేల్చేయడంతో, మండలి ఛైర్మన్ ఆదేశాల మేరకు సెలక్ట్ కమిటీకి వైసీపీ తమ సభ్యుల పేర్లను ఇవ్వక తప్పదని న్యాయ నిపుణులూ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సభ్యుల లిస్ట్ అంటూ ఇస్తే.. వైసీపీ, మండలి విషయంలో మడమ తిప్పినట్లే అవుతుందేమో.!