ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి టైమ్స్ నౌ చేసిన సర్వే ఆసక్తిదాయకంగా ఉంది. పార్టీలు మెనిఫెస్టోలను ప్రకటించుకుని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. ఎన్నికల ఫలితాలు మాత్రం వన్ సైడెడ్ గా ఉంటాయని ఈ సర్వే అంటోంది. మూడు పార్టీల మధ్యన సాగుతున్న ఈ పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీదే పై చేయి అని టైమ్స్ నౌ చెబుతూ ఉంది.
సాధారణంగా టైమ్స్ గ్రూప్ భారతీయ జనతా పార్టీకి కాస్త అనుకూలంగా ఉంటుందంటారు. ప్రత్యేకించి ముందస్తు సర్వేలు, ముందస్తు భజన కార్యక్రమాల్లో టైమ్స్ నెట్ వర్క్ మోడీ అనుకూలతనే వ్యక్తీకరిస్తూ ఉంటుందనేది పరిశీలకుల అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో ఆప్ దే పై చేయి అని టైమ్స్ నెట్ వర్క్ కుండబద్దలు కొడుతూ ఉండటంతో.. ఆ పార్టీకి విజయావకాశాలు గట్టిగా ఉన్నాయనే అభిప్రాయాలకు కారణం అవుతూ ఉంది.
ఈ సర్వే ప్రకారం.. ఢిల్లీలో 70 సీట్లకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 54 నుంచి 60 సీట్ల వరకూ సొంతం చేసుకునే అవకాశం ఉంది! క్రితం సారితో పెద్దగా తీసిపోని విజయం ఇది. ఐదేళ్ల కిందట ఆప్ 67 సీట్లను నెగ్గిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాలన తర్వాత కూడా అరవై వరకూ ఆప్ కు వచ్చే అవకాశాలున్నాయని టైమ్స్ నౌ చెబుతూ ఉండటం గమనార్హం.
ఇక రెండో స్థానం భారతీయ జనతా పార్టీదే అని టైమ్స్ నౌ అంటోంది. ఆ పార్టీకి కనిష్టంగా 10, గరిష్టంగా 14 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ పత్రిక అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ చిత్తు అవుతుందని, మహా అంటే రెండు సీట్లకు మించి ఆ పార్టీ సాధించుకునే అవకాశాలు లేవని ఈ సర్వే అభిప్రాయపడింది.