పాదయాత్రలు అధికారానికి దగ్గర మెట్లు అన్నది ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే రుజువై నిజమై నిలిచింది. ఇపుడు ప్రజల సెంటిమెంట్లను పట్టడానికి పాదయాత్రల కంటే మించినది లేదు అంటున్నారు తెలివైన ఉద్యమకారులు.
అమరావతి రాజధాని రైతులు న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్రను చేస్తున్నారు. అమరావతి రాజధానికే ఏపీ జనం మద్దతు ఉందని గట్టిగా చేప్పాలనుకుంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా దీని వెనక పార్టీ రాజకీయాలు లేవు అంటే ఒప్పుకునే సీన్ లేదు.
ఇపుడు దానికి కౌంటర్ అన్నట్లుగా ఉత్తరాంధ్రా జిల్లాల్లో మరో పాదయాత్రకు రంగం సిద్ధం అవుతోందిట. స్వచ్చంద సంస్థలు, మేధావులు, ప్రజా సంఘాలతో కూడిన ఈ ఉద్యమం విశాఖే పాలనా రాజధాని కావాలని నినదించనుందిట. మూడు జిల్లాలలోని మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఈ మహా పాదయాత్ర సాగనుందిట.
విశాఖలో పాలనా రాజధాని ఎందుకు ఉండాలి, దాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమిటి అన్న దాని మీద జనాలను చైతన్యం కలిగించేందుకు ఈ పాదయాత్రను చేపడతారని భావిస్తున్నారు. తొందరలోనే ఈ పాదయాత్ర మొదలవుతుంది అంటున్నారు.
అదే కనుక జరిగితే ఉత్తరాంధ్రాలో రాజకీయ సమీకారణలలో కూదా భారీ తేడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి తమ్ముళ్లకు కూడా ఇది ఒక విధంగా గుక్క తిప్పుకోలేని ఉద్యమమే అవుతుంది అని కూడా అంచనా కడుతున్నారు.